
సోషల్ మీడియా వేదికగా.. డబ్బున్న అబ్బాయిలను వలలో వేసుకొని.. వారి వద్ద నుంచి డబ్బు గుంజుతున్న ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరిట కొందరినీ... పెళ్లి పేరిట మరి కొందరిని ఆమె మోసం చేయడం గమనార్హం. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ధరణి రెడ్డిని నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సదరు మహిళ గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా వలపు వల విసరుతూ డబ్బులు గుంజుతోంది. కొందరిని ప్రేమ, మరికొందరిని పెళ్లి పేరిట ఆమె దారుణంగా మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ కి చెందిన కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ అనే యువకుడి తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అతనితో అసభ్యరీతిలో వీడియో ఛాటింగ్ చేసింది. ఆ తర్వాత దానిన్నంతటినీ వీడియో తీసి.. దానిని చూపించి బెదిరించడం మొదలుపెట్టింది. మూడు నెలలుగా డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టింది.
ఇక మరికొందరి విషయంలో పెళ్లి సంబంధాలు చూపిస్తానని మాయమాటలు చెప్పి.. వారి తల్లిదండ్రుల వద్ద నుంచి ఫీజు రూపంలో నగదు లాక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సదరు మహిళ పలువురు బాధితుల నుంచి రూ.11.70లక్షలు వసూలు చేయడం గమనార్హం.
నల్గొండ వన్ టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న ఆమెను శనివారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేశ్వరిపై తెలంగాణలోని పలు స్టేషనల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.