ఫాం హౌస్ లో రేవ్ పార్టీ..67మంది యువతీయువకులు అరెస్ట్

By telugu news teamFirst Published Jun 14, 2021, 8:00 AM IST
Highlights

 దాదాపు 67మంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగింది.

ఓవైపు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు.  అయితే.. ఈ లాక్ డౌన్ పట్టించుకోకుండా.. కరోనాను లెక్క చేయకుండా.. కొందరు యువతీయువకులు పార్టీల పేరిట రెచ్చిపోయారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పుట్టినరోజు పేరిట ఫాంహౌస్ లో మద్యం సేవిస్తూ.. డీజే శబ్దాలతో చిందులేస్తూ రచ్చచేశారు. ఈ ఘటనలో ఈ రేవ్ పార్టీ నిర్వాహకులతోపాటు.. దాదాపు 67మంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్ లో ఈ పార్టీ జరిగింది.

కడ్తాల్ మండల కేంద్ర సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్ లో హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి వరుణ్ గౌడ్ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. హైదరాబాద్ లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

రాత్రి మద్యం సేవిస్తూ.. డీజే శబ్దాలతో హోరెత్తిస్తూ చిందులు వేస్తూ, నృత్యాలు చేస్తున్నారు. ఎస్వోటీ పోలీసులు, కడ్తాల్ ఎస్ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్ పై రాత్రి 11గంటల 30 నిమిషాలకు దాడులు నిర్వహించారు.

వరుణ్ గౌడ్ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21మంది యువతులు, 43మంది యువకులు అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్ యజమాని భరత్ ఏ1 నిర్వహకులు మెహదీపట్నానికి చెందిన జిషాన్ అలీఖాన్ ఏ2 , ఎస్ఆర్ నగర్ కు చెందిన అన్వేష్ ఏ3 పరారీలో ఉన్న వరుణ్ గౌడ్ ఏ4 గా కేసు నమోదు చేశారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలిపారు.

కాగా.. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవ్ పార్టీ చేసుకుంటూ.. పోలీసులకు చిక్కిపోవడంతో బర్త్ డే పార్టీ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. 

click me!