
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూ వుంటారు. ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్రంలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మారిపోతారు. తాజాగా శనివారం మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో (ICRISAT 50th Anniversary) పాల్గొన్న ప్రధాని మోడీ... కార్యక్రమాన్ని ముగించుకుని శంషాబాద్ వెళుతూ ఇక్రిశాట్ ఆవరణలోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా శెనగ పంట (chana) వద్దకు వెళ్లి.. కాయలు తెంపుకుని రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతకుముందు ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో (icrisat 50 years celebration) పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. శనివారం ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ... ఆజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నారు. ఇక్రిశాట్ సేవలను తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశానని మోడీ పేర్కొన్నారు. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తోందని ప్రధాని ప్రశంసించారు. వసంత పంచమి రోజున స్వర్ణోత్సవవాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు.
వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమని మోడీ పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తామని.. కానీ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం గురించి మాట్లాడమని ఆయన గుర్తుచేశారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ప్రధాని తెలిపారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుందని.. ఈసారి బడ్జెట్‌లో కూడా వాతావరణ మార్పుల అంశానికి ప్రాధాన్యం ఇచ్చామని మోడీ గుర్తుచేశారు.
దేశంలో వ్యవసాయానికి సంబంధించి విభిన్నమైన సంప్రదాయాలు వున్నాయని... సహజ సేద్యం, డిజిటల్ వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. వచ్చే 25 ఏళ్లలో వ్యవసాయం మార్పులపై దృష్టి సారించామని.. డిజిటల్ వ్యవసాయం దేశ ముఖచిత్రాన్ని మార్చుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. యువకులు ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలని మోడీ కోరారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాల్లో కృత్రిమ మేథను వినియోగించబోతున్నామని.. సమ్మిళిత వృద్ధికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రైతులకు ఈ మిషన్ చాలా ఉపయోగకరమని.. మెట్ట ప్రాంతాల పరిశోధనలో ఇక్రిశాట్‌కు చాలా గొప్ప పేరుందని మోడీ ప్రశంసించారు. ఇది సేంద్రీయ ఇంధనాల శకమని.. రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
"