శ్రీరాముడివలె మోడీ గుణ సంపన్నుడు.. ఆయన వల్లే భారత్ తలెత్తుకుంటోంది : చినజీయర్ స్వామి

Siva Kodati |  
Published : Feb 05, 2022, 08:02 PM IST
శ్రీరాముడివలె మోడీ గుణ సంపన్నుడు.. ఆయన వల్లే భారత్ తలెత్తుకుంటోంది : చినజీయర్ స్వామి

సారాంశం

ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు చినజీయర్ స్వామి. శనివారం ముచ్చింతల్‌లోని శ్రీరామానగరంలో సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. మోడీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని చినజీయర్ అన్నారు.   

శ్రీరాముడు వ్రత సంపన్నుడని.. మోడీ కూడా శ్రీరాముడిలా గుణ సంపన్నుడని ప్రశంసించారు చినజీయర్ స్వామి (chinna jeeyar swamy ) . శనివారం ముచ్చింతల్‌లోని (muchinthal) శ్రీరామానగరంలో సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ( narendra modi )  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినజీయర్ మాట్లాడుతూ.. మోడీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయ్యాకే భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చిందిస్తోందని చినజీయర్ అన్నారు. ప్రపంచంలో భారత్‌ తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ కంకణబద్ధులై ఉన్నారు అని చిన జీయర్‌ ప్రశంసించారు. 

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan redddy) మాట్లాడుతూ.. సర్వమానవ సౌభ్రాతృత్వానికి రామానుజ స్వామి ఆ రోజుల్లోనే సందేశం ఇచ్చారని అన్నారు. ప్రజలంతా ఒక్కటేనని.. వారిలో ఏ ఒక్క తారతమ్యం వుండటానికి వీల్లేదని కిషన్ రెడ్డి అన్నారు. దైవం ముందు అందరూ సమానులేనని, మానవసేవే- మాధవ సేవ అని రామానుజచార్యులు చెప్పారని కేంద్ర మంత్రి అన్నారు. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పిన సందేశం మన సమాజానికి ఉపయోగపడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. రామానుజాచార్యుల స్పూర్తితో చినజీయర్ స్వామి ఒక యజ్ఞంలాగా, తపస్సులాగా అహోరాత్రులు శ్రమించి అనేక మంది భక్తులను  ఏకం చేసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రపంచానికి అందించారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. 

తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని.. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని మోడీ గుర్తుచేశారు. దేశ సంస్కృతిని ఈ సమతామూర్తి మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 108 దివ్యదేశ మందిరాలను ఇక్కడే చూశానని.. శ్రీరామానుజాచార్యులు విశిష్టద్వైతం ప్రవచించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని మోడీ పేర్కొన్నారు. 

ప్రగతిశీలత, ప్రాచీనతలో భేదం లేదని రామానుజార్యులను చూస్తే తెలుస్తుందన్నారు. వెయ్యేళ్ల కిందట మూఢ విశ్వాసాలు ఎంతగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. మూఢ విశ్వాసాలను తొలగించేందుకు ఆనాడే రామానుజాచార్యులు కృషి చేశారని మోడీ కొనియాడారు. ఆనాడే దళితులను కలుపుకుని ముందుకు సాగారని... ఆలయాల్లో దళితులకు దర్శనభాగ్యం కలిగించారని ప్రధాని తెలిపారు. రామానుజాచార్య బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (dr br ambedkar) కూడా రామానుజాచార్య ప్రవచనాలనే చెప్పారని మోడీ గుర్తుచేశారు. 

సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని.. అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. సబ్ కా సాథ్.... సబ్ కా వికాస్ నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉజ్వల్ పథకం, జన్‌ధన్, స్వచ్ఛ్‌భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని ప్రధాని పేర్కొన్నారు. గురుమంత్రాన్ని రామానుజాచార్య అందరికీ అందించారని .. దేశ ఐక్యతకు ఆయన స్పూర్తి అని, దేశమంతటా పర్యటించారని మోడీ తెలిపారు. 

అందుకే దళిత అణగారిన వర్గాల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదని ప్రధాని అన్నారు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోందని.. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారని మోడీ వెల్లడించారు. పోచంపల్లికి ప్రపంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కిందని ప్రధాని చెప్పారు. అలాగే రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందని నరేంద్ర మోడీ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?