ఎన్టీఆర్ గురించి ప్రస్తావన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోరుపై తెలంగాణ బీజేపీకి ప్రధాని మోదీ కీలక సూచన..!

By Sumanth KanukulaFirst Published Jan 18, 2023, 10:59 AM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు గురించి ప్రస్తావించారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్టీఆర్‌ను ప్రజా నాయకుడు అని మోదీ అభివర్ణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు గురించి ప్రస్తావించారు.  ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని తెలంగాణ బీజేపీ నేతలకు ఆయన సూచన చేశారు. ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని.. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్టీఆర్‌ను ప్రజా నాయకుడు అని మోదీ అభివర్ణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్టీఆర్ పోరాడిన తీరు తెలంగాణ బీజేపీకి స్పూర్తిగా నిలవాలని రాష్ట్ర నేతలకు మోదీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన పార్టీ విజయం కోసం ఎన్టీఆర్ కృషి.. అందించిన ఫలాల గురించి కూడా మోదీ ప్రస్తావించినట్టుగా సంబంధింత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఎన్నికల పోరులో పరాక్రమంతో పోరాడాలని తెలంగాణ బిజెపి నాయకులను కోరారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రెండు రోజుల ఈ సమావేశాల్లో తెలంగాణపై ప్రధాని విస్తృతంగా చర్చించారు. ప్రధానమంత్రి సందేశం మాకు స్పష్టంగా ఉంది. ఆయన ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించారు. మా ప్రయత్నాలను అభినందించారు. మేము ఖచ్చితంగా రాష్ట్రంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము’’ అని అన్నారు. 

Also Read: ఫ్రమ్ ది ఇండియా గేట్: కేబినెట్ విస్తరణపై ఆశలు, ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ, పేద పార్టీ.. ధనిక కార్యకర్తలు..

మరోవైపు  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మొదటి రోజు.. బండి సంజయ్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసంగ్రామ యాత్రను ప్రశంసిస్తూ.. తన యాత్రను చూసి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాలని కోరారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌ఐఏ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. ‘‘నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీట్ మొదటి రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రదర్శన సుమారు ఒక గంట పాటు కొనసాగింది. ఇందులో ప్రజా సంగ్రామ యాత్రను ఆయన వ్యూహాత్మకంగా ఎలా ప్లాన్ చేసాడో, నిరంతర అడ్డంకులు ఎదురవుతున్న ముందస్తు ప్రణాళికలతో ఈ ప్రయాణాన్ని ఎలా పూర్తి చేసాడో చెప్పాడు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. 

ఇక, బండి సంజయ్ హిందీ భాషలో ప్రెజెంటేషన్‌ను ప్రారంభించారు.. అయితే తన సొంత భాషలో ఈ ప్రెజెంటేషన్‌ను మరింత మెరుగ్గా వ్యక్తీకరించగలడని ప్రధాని అర్థం చేసుకున్నందున, తెలుగు భాషలోనే ప్రదర్శన ఇవ్వమని కోరారు. భాష అడ్డంకి సృష్టించడం తనకు ఇష్టం లేదని ప్రధాని అన్నారు. బండి సంజయ్ తెలుగు ప్రెజెంటేషన్‌ను తర్వాత తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ హిందీలోకి అనువదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర జరిగిన తీరును వివరించారు. 

click me!