
The Kashmir Files: దేశవ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) అనే చిత్రం చర్చనీయంగా మారింది. ఓ వర్గం వారు ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరో వర్గం వారు ఈ చిత్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పెను సంచలనంగా మారింది. పాజివిట్, నెటివిట్ టాక్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల వర్గం కురిపిస్తోంది. ఈ చిత్రంలో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను కళ్లకు కట్టారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అనుపమ్ ఖేర్ కీలకపాత్ర నటించారు. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దాడులను ఈ సినిమాలో దర్శకుడు కండ్లకు కట్టినట్టుగా చూపించారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని బహిష్కరించాలని, ఆంక్షలు విధించాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 'ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం.. సమాజంలో చీలికను సృష్టిస్తుందనీ, ఈ సినిమాలో మతవిద్వేషాలను రేకేత్తించేలా కొన్ని ఘటనలున్నాయనీ, ఆ భాగాలను తొలగించాలని కోరుతూ హైకోర్టులో బుధవారం ఎంఐఎం ఇంక్విలాబ్ పార్టీ నాయకుడు మహ్మద్ సమీ ఉల్లా ఖురేషి పిటిషన్ దాఖలైంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చిత్రీకరించిన అంశాలు తొలగించేలా ఆదేశించాలని కోరారు.
సినిమాలో కొన్ని సీన్లు మత విద్వేశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభ్యంతరాలు లేవనెత్తాడు. ఇతర కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దాడులు జరగవచ్చని.. తాను లేవనెత్తిన ఆందోళనలను రాష్ట్రం, కేంద్రం, సెన్సార్ బోర్డు , చిత్ర నిర్మాతలు పట్టించుకోలేదని హైకోర్టును ఆశ్రయించారు. కశ్మీర్ పండిట్లకు ముస్లింలు వ్యతిరేకమనే భావన కలిగేలా సినిమా చిత్రీకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చిత్రీకరించిన అంశాలు తొలగించేలా ఆదేశించాలని కోరారు.
ఈ కేసులో కేంద్ర సెన్సార్ బోర్డు తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదించారు. సినిమాకు ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయిందని తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్‌పై అభ్యంతరాలు ఉంటే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని.. నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదని వాదించారు. ఇదే కారణంతో ఇటీవల ముంబయి హైకోర్టు అక్కడి పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. ఈ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అభ్యంతరాల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో పిటిషన్ ఉపహసంహరించుకుంటానని ఖురేషి తరఫు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మంగళవారం స్పందించారు. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన చిత్రమేనని, నిర్దిష్టంగా ఒక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఆరోపించారు. చిత్రం వాస్తవిక పరిస్థితులకు చాలా దూరంగా ఉందని అన్నారు. 1990లో చోటుచేసుకున్న ఘటనలు, కశ్మీరీ పండిట్ల వలసలకు నేను బాధ్యుడినని రుజువైతే దేశంలో ఎక్కడైనా ఉరితీయండి.. ఇందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉద్వేగంగా అన్నారు.
కాశ్మీరీ పండిట్ల వలసల సమయంలో ఏమి జరిగిందో ? తెలుసుకోవడానికి నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే అని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 1990లో జరిగింది అది విషాదమే.. ఆ సమయంలో తన కాశ్మీరీ పండిట్ సోదరులు, సోదరీమణులు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిందని, ఆ పరిస్తితికి కారకులెవరో తెలుసుకోవాలని కోరుకుంటున్నానని అబ్దుల్లా అన్నారు.