ఫోన్ ట్యాపింగ్ కేసు: మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీల అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 24, 2024, 8:42 AM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్ కేసులో  మరో ఇద్దరు ఎఎస్పీలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు  ఇచ్చిన సమాచారం మేరకు  ఈ ఇద్దరు ఎఎస్పీలను విచారించారు.  ఈ విచారణ తర్వాత వీరిద్దరిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు చోటు చేసుకుంది.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో  ఇద్దరు అడిషనల్ ఎస్‌పీలను  అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. 

ఫోన్ ట్యాపింగ్ లో  ఎస్ఐబీలో  పనిచేసిన డీఎస్పీ  ప్రణీత్ రావును  వారం రోజుల పాటు సిట్  విచారించింది.  ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉంటే శనివారం నాడు  ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను  పోలీస్ బృందం  విచారించింది. పోన్ ట్యాపింగ్ కేసులో  వీరిద్దరిని  ఎనిమిది గంటల పాటు విచారించారు.  ఎనిమిది గంటల విచారణ తర్వాత వీరిద్దరిని అరెస్ట్ చేసినట్టుగా  అధికారులు ప్రకటించారు.

అరెస్టైన ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు ఆదివారం నాడు ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిద్దరిని జడ్జి ముందు హాజరుపర్చనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  అధికారంలో ఉన్న సమయంలో  విపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని  అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.ఈ విషయమై అప్పటి పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేశారు. కొందరు బీజేపీ నేతలు కూడ ఈ విషయమై ఫోన్ ట్యాపింగ్ పై  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయమై విచారణ ప్రారంభమైంది.ఈ కేసులో  ప్రణీత్ రావును  విచారించారు.  ప్రణీత్ రావుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల విచారణలో ప్రణీత్ రావు  కీలక విషయాలను వెల్లడించినట్టుగా  సమాచారం.ఇదిలా ఉంటే  గత ప్రభుత్వంలో  ఎస్ఐబీతో పాటు ఇతర కీలక విభాగాల్లో పనిచేసిన కొందరు మాజీ పోలీసు అధికారులు  విదేశాలకు వెళ్లినట్టుగా  ప్రచారం సాగుతుంది.

 

click me!