
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో పెట్రో బంక్ డీలర్లు రేపటి నుంచి సమ్మెకు దిగబోతున్నారు. కమీషన్ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.తొలుత రెండు రోజుల పాటు కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నారు. ఈ మేరకు గురువారం కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం ఇదే కొనసాగించనున్నారు. ఆ తర్వాత శనివారం నుంచి ఒకే షిష్ట్‌లో అమ్మకాలు జరపాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఆ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకే పెట్రో అమ్మకాలు కొనసాగిస్తారు. ఇక ఆదివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ప్రతి ఆదివారంతో పాటు, బ్యాంక్‌ల సెలవు రోజుల్లో బంక్‌లు మూసివేయాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఈనెల 15న దేశవ్యాప్తంగా బంక్‌ల బంద్ పాటించనున్నారు. 5 శాతం కమిషన్ పెంచాలని, రవాణా చార్జీలు తగ్గించాలనేది పెట్రో బంక్ యజమానుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. 2011లో కేంద్ర ప్రభుత్వం నియమించిన అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
బంద్ ఇలా...
రేపటి నుంచి ఉదయం 8.00 నుండి సాయంత్రం 6.00 వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పని చేస్తాయి. సాయంత్రం 6.00 తరువాత పెట్రోల్, డీజిల్ సరఫరా ఉండదు. అలాగే ప్రతి ఆదివారం మరియు ప్రతి రెండవ, నాల్గవ శనివారం కూడా పెట్రోల్ బంకులకు సెలవు.. పండగ రోజులలో కూడా పెట్రోల్ బంక్ లు పనిచేయవు.
నిత్యవసరాల ధరలపై ప్రభావం...
పెట్రోల్ బంక్ ల బంద్ వల్ల తెలంగాణలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఒక్క హైదరాబాద్ లోని రోజూ దాదాపు 40 లక్షల వాహనాలు తిరుగుతుంటాయని అంచనా. ఇక రాష్ట్రం మొత్తంగా చూస్తే వాహనాల సంఖ్య కోటి దాటుతుంది.
హైదరాబాద్ లో దాదాపు 3200 బంక్ లు ఉన్నాయి.ఒక్కో బంక్
రోజుకు సగటున 2 లక్షల లీటర్ల పెట్రోల్ , డీజిల్ లను సరఫరా చేస్తున్నాయి. మెరుపు సమ్మే వల్ల వాహనదారులు ఇబ్బందులు పడడమే కాదు. నిత్యవసరాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.