
హైదరాబాద్ : త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో తమకు అన్యాయం జరిగిందని పెరిక కులస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. కామారెడ్డిలో పెరిక కూలానికి చెందిన గంప గోవర్ధన్ స్థానంలో స్వయంగా కేసీఆర్ పోటీచేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ పెరిక కులస్తులను రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలని... అందుకోసం కనీసం మూడు నియోజకవర్గాల్లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. రామగుండం, కోదాడ, మంచిర్యాల నియోజకవర్గాల్లో పెరిక కులానికి చెందిన బలమైన అభ్యర్థులు బిఆర్ఎస్ లో వున్నారని.. వారికి టికెట్లు కేటాయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని పలువురు పెరిక కులానికి చెందిన నాయకులు మిమ్మల్ని అభ్యర్ధించారు... కానీ వారికి అవకాశం దక్కలేదని పెరిక సంఘం పేర్కొంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డవారిలో రామగుండం నియోజకవర్గం పాలకుర్తి జడ్పిటిసి, పెరిక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కూడా వున్నారన్నారు. ఆమెకు కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పలు సందర్భాల్లో టికెట్ హామీ ఇచ్చారని... దీంతో ఆమెకు తప్పకుండా ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం దక్కుతుందని భావించామన్నారు. కానీ చివరకు నిరాశే ఎదురయ్యిందన్నారు.
ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ శిరీష భర్త, బిఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ కు కూడా బిఆర్ఎస్ టికెట్ లభిస్తుందని భావించామని... కానీ అక్కడా నిరాశే ఎదురయ్యిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషిచేసిన అతడికి టికెట్ దక్కకపోవడం పార్టీ శ్రేణుల్లోనే కాదు పెరిక సంఘం నాయకులనూ తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇలా ఈ ఇద్దరిని రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాం... ఆ అవకాశం బిర్ఎస్ నుండే లభిస్తుందని భావించామన్నారు. కానీ వారికి టికెట్ దక్కకపోవడం రాష్ట్రంలోని ప్రతి పెరిక కులస్తుడిని ఆవేదనకు, ఆందోళనకు గురిచేసిందని ఈ కులసంఘం సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది.
Read More గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్ల కేసీఆర్ పోటీ... పక్కా వ్యూహంతో ముందుకు..: కవిత
తెలంగాణలో మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం, కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్, పెద్దపల్లి, మంథని, ఉప్పల్, ఎల్బి నగర్,మేడ్చల్, మిర్యాలగూడ, తుంగతుర్తి, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, వరంగల్ ఈస్ట్, మహబూబాబాద్, నర్సంపేట, అచ్చంపేట, పాలకుర్తి, నల్గొండ, బోధన్, బాన్సువాడ, భూపాలపల్లి, పరకాల తదితర నియోజకవర్గాల్లో పెరక కులస్తుల ప్రాబల్యం ఎక్కువగా వుంటుందని పెరక సంఘం నాయకులు పేర్కొన్నారు. కాబట్టి రామగుండం,కోదాడతో పాటు మంచిర్యాలలో పెరకలకు అవకాశం కల్పించాలని... తద్వారా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోని వారంతా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని అన్నారు. టికెట్ల కేటాయింపులో పెరికలకు తగిన ప్రాధాన్యత లభిస్తే కనీసం 27 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మేలు జరుగుతుందని... బిఆర్ఎస్ విజయం మరింత సునాయాసం అవుతుందని పెరిక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ను కోరారు.
ఇక గంప గోవర్దన్ మీకోసం తన సీటునే త్యాగం చేసాడు కాబట్టి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారని నమ్ముతున్నామన్నారు. కానీ ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నుండి ఇప్పటివరకు గత 40 ఏళ్లలో పెరిక కులస్తులు చట్టసభలో స్థానం లేని దుస్థితి ఎప్పుడూ రాలేదని... కానీ ఈసారి ఆ పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన కలుగుతోందన్నారు. ఈ రాజకీయ పరిణామాలను పెరిక జాతి జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. కాబట్టి తమకు అన్యాయం జరక్కుండా చూసి తమ కులస్తులకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పించాలని పెరిక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ను కోరారు.