
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని ప్రజల తరపున సీఎం కేసీఆర్ మొక్కుకున్నారు.
12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన కల ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సీఎం హోదాలో తిరుమల శ్రీవారికి తన మొక్కు చెల్లించుకోబోతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రాక తిరుమలలో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ కేసీఆర్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.
అయితే సీఎం తిరుమల పర్యటనలో ఆయనతో పాటు మరొకరు కూడా తన మొక్కును కాదా కాదు తన శపథాన్ని నేరవేర్చుకోబోతున్నారు.
ఆయనే పెద్ది సుదర్శన్. టీఆర్‌ఎస్ నేత, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ కూడా.
బుధవారం తిరుమలలో స్వామివారి సన్నిధానంలోని పుష్పగిరి మఠంలో ఈయన ఓ ఇంటి వాడు అవబోతున్నాడు.
ఇందులో విశేషం ఏముందీ అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాకే తాను పెళ్లి చేసుకుంటానని ఆయన శపథం చేశారు. 15 ఏళ్లుగా అదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు తిరుమలలో పెళ్లి చేసుకొని తన శపథం నెరవేర్చుకోబోతున్నారు.
నెక్కొండ మండల నాగారం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు లక్ష్మీని ఆయన కులాంతర వివాహం చేసుకోబోతున్నారు.
సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవిత తదితరులు ఈ పెళ్లికి హాజరవనున్నారు.