ఆ పార్టీకి ఓటేస్తే మోదీకి వేసినట్లే:పీసీసీ చీఫ్ ఉత్తమ్

By Nagaraju TFirst Published Oct 2, 2018, 3:28 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోదీకి వేసినట్లేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ చాలా అంశాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిందని తెలిపారు.  బీజేపీకి మద్దతునిస్తున్న టీఆర్ఎస్ తో ఎంఐఎం ఎందుకు పొత్తుపెట్టుకుంటుందని నిలదీశారు. 
 

హైదరాబాద్‌: టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోదీకి వేసినట్లేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ చాలా అంశాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిందని తెలిపారు.  బీజేపీకి మద్దతునిస్తున్న టీఆర్ఎస్ తో ఎంఐఎం ఎందుకు పొత్తుపెట్టుకుంటుందని నిలదీశారు. 

టీఆర్ఎస్-ఎంఐఎంల బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఉత్తమ్. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్‌ ముస్లింలకు చేసిందేమీ లేదని అయినా ఎంఐఎం మద్దతు ఇస్తుందన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసినందుకా టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారా? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పాలనలో వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాపాడలేకపోయారని, ముస్లిం యువతకు 10% రుణాలు కూడా మంజూరు చేయలేకపోయారని ఉత్తమ్ విమర్శించారు. మైనారిటీ కళాశాలను 90శాతం మూసివేశారని ఆరోపించారు. ఆలేరు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ముస్లింలు చనిపోయారని, ఈ ఘటన జరిగి నాలుగేళ్లయినా ఇంతవరకు ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదన్నారు. 

టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉర్దూ ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదని ఉత్తమ్ అన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. 

ఇస్లామిక్‌ సెంటర్‌ కోసం ఇప్పటివరకు పునాదిరాయి కూడా వేయలేదన్నారు. రూ.40కోట్ల విలువైన భూమి కోసమే ఎంఐఎం నేతలు టీఆర్ ఎస్ కు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం నేతల స్వప్రయోజనాల కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

click me!