అనంతపురం నుండే పవన్ పోటి

First Published Nov 10, 2016, 12:19 PM IST
Highlights

ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్   ఒకలా వంచిస్తే, ప్రత్యేకహోదా విషయంలో భాజపా, టిడిపిలు మరొకలా  మోసగించాయి

ఎట్టకేలకు సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్ధాపకుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే విషయంపై స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తాను అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు పవన్ స్పష్టం చేసారు. గురువారం అనంతరపురం పట్టణంలో జరిగిన సభలో గంటపాటు పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

 

జనసేన తరపున రాష్ట్రంలో తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాను పోటి చేసినపుడు తనకు ఓట్లు వేసినా, వేయకపోయినా పోటీ చేసేది మాత్రం ఖాయమని కుండబద్దలు కొట్టారు. వెనుకబడిన, కరువు పీడిత జిల్లా అనంతపురం అటే తనకు చాలా అభిమానంగా చెప్పుకొచ్చారు. తాను పార్టీ పెట్టింది ప్రజల కోసమే గానీ తన సొంతం కోసం కాదని స్పష్టం చేసారు.

 

 గంటపాటు సాగిన ప్రసంగంలో అనేక అంశాలను స్పృసించినా కొన్ని  విషయాల్లో మరింత స్పష్టత అవసరం  ఎందుకంటే, అటు కేంద్రాన్ని గానీ ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని గానీ ఏవో అడగాలనుకున్నా అడగలేకపోయారేమో అనిసిస్తోంది.  కొన్ని విషయాల్లో ఆయన ప్రసంగాల్లోని డైలాగులు పూర్తిగా వికసించలేదు. అయితే, తన ప్రసంగంలో గతంలో కనబడని వాడి, వేడి మాత్రం కనబడింది. బహుశా త్వరలో జనసేనకు పూర్తిస్ధాయి రాజకీయ పార్టీ రూపం ఇవ్వదలుచుకున్న కారణంగానే ప్రసంగంలో స్పష్టత వస్తోంది. బహుశా వచ్చే బహిరంగ సభకు పవన్ మాటల్లో మరింత స్పష్టత వస్తుందేమో.

 

   తాను చేయబోతున్న సరికొత్త రాజకీయం కోసం కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మద్దతు కావాలని పవన్ కోరుకున్నారు. జనరేషన్ నష్టపోతుంటే తాను చూస్తూ ఊరుకునే వ్యక్తిని కానని స్పష్టం చేసారు. అందుకు కారకులైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలను నిలదీస్తానని చెప్పారు. మాట తప్పిన, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకు తిరిగే పార్టీలను ఎలా నిలదీయాలో తనకు బాగా తెలుసన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పని జనసేన చేస్తుందని హెచ్చరించారు.

 

  ప్రత్యేకహోదాపై ఎన్నికల్లో ప్రసంగాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చిన టిడిపి, భాజపాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం స్పష్టంగా మాట్లాడే నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు అర్ధకాని రీతిలో మాట్లాడటం మామూలేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయడులకు చరక లంటించారు. 

 

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో జవాబు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబునాయడుపై ఉందన్నారు. అర్ధరాత్రి ప్యాకేజిని ప్రకటిస్తున్నపుడే ప్రజలను కేంద్రం మరోసారి వంచిస్తోందన్న విషయం అర్ధమైందన్నారు.

 

  తనకు చంద్రబాబునాయడు, వైఎస్ జగన్ ఇద్దరూ ఒకటేనన్నారు. వీరిద్దరిలో ఎవరితోనూ తనకు శత్రుత్వంలేదన్నారు. ప్రత్యేకహోదా అంశం వెంకయ్య దృష్టిలో ముగిసిన అధ్యాయం అయ్యిందేమో గానీ అనంతపురం జిల్లా వంటి కరువు, వెనుకబడిన జిల్లాలకు మాత్రం ప్రత్యేక హోదా అమృతంతో సమానమన్నారు.

 

ప్రజలకు నష్టం జరుగుతోందని అనిపించినపుడు ఎవ్వరినైనా సరే ఎదురువెళ్లి మాట్లాడటానికి వెనకాడనన్నారు.సవాళ్లెదురయినపుడు పారిపోయే వాణ్ని కాదు.పోరాటానికి తెగిస్తాను. మడమ వెనక్కి తిప్పను ,’ అని చెప్పారు.

 

ప్రత్యేక ప్యాకేజి గురించి ప్రకటించటానికే ప్రభుత్వాలకు రెండున్నరేళ్ళు పడితే ఇక, పరిశ్రమలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, యువతకు ఉపాధి ఎప్పుడు చూపిస్తారంటూ నిలదీసారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ ఒకలాగ వంచిస్తే, ప్రత్యేకహోదా విషయంలో భాజపా, టిడిపిలు మరో విధంగా వంచించినట్లు ధ్వజమెత్తారు.

 

click me!