
మిగులు విద్యుత్ ఉత్పత్తి దిశగా వేగంగా అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం చెక్ పెట్టింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం అందుకు అనుగుణంగా వేగంగా ప్రాజెక్టు పనులు చేపట్టింది. అయితే పాత సాంకేతికత, పర్యావరణానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లే సబ్ క్రిటికల్ సాంకేతికతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రెడీ అయింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యగా మారింది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తమ అనుమతుల కమిటీ (ఈసీ) జాబితా నుంచి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తొలగించింది. 13వ ప్రణాళిక కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సూపర్ క్రిటికల్ సాంకేతికత వాడుతున్న వాటినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఈ ప్రాజెక్టును జాబితా నుంచి తొలగిస్తున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఇది సాంకేతిక చర్యేనని... ప్రాజెక్టుకు అనుమతి నిరాకరించినట్లేమీ కాదని తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు సమర్థించుకుంటున్నారు.
270 మెగావాట్లతో కూడిన 4 యూనిట్ల ఈ థర్మల్ కేంద్రాన్ని ఆధునిక సూపర్ క్రిటికల్ సాంకేతికతతో కాకుండా సబ్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీహెచ్‌ఈఎల్‌తో తెలంగాణ జెన్‌కో ఒప్పందం కూడా చేసుకుంది.
నిరుడే దీనికి సంబంధించిన ప్రాథమిక పనులను మణుగూరులో మొదలెట్టగా... మానవ హక్కుల వేదిక అనే స్వచ్ఛంద సంస్థ అభ్యంతరాలు వ్యక్తంజేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని 8 వారాల్లో తేల్చాల్సిందిగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిపుణుల కమిటీని గ్రీన్ ట్రైబ్యునల్ కొద్దినెలల కిందట ఆదేశించింది. ఈ మేరకు ఆచార్య సి.ఆర్.బాబు సారథ్యంలోని ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరీక్షించి పచ్చజెండా వూపింది. దీంతో కీలకమైన అడ్డంకిని అధిగమించినట్లయింది. అయితే సబ్ క్రిటికల్ సాంకేతిక కారణంతో పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనికి అనుమతి ఇవ్వడం కుదరని స్పష్టం చేసింది. అయితే, ఈ విషయమై.. ‘కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాం. సమస్యలు అధిగమిస్తామని తెలంగాణ జెన్ కో అధికారులు తెలిపారు.