మునుగోడు ఉపఎన్నిక : కొత్త ఓటర్ల నమోదుకు యత్నం.. పార్టీల స్కెచ్, యువత కరుణ ఎవరి వైపో

By Siva KodatiFirst Published Oct 4, 2022, 4:27 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించిన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం, ఇతర కార్యక్రమాలను ఉద్ధృతం చేశాయి. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు పార్టీలు యత్నిస్తున్నాయి. 

మునుగోడులో ఓట్ల నమోదుకు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే భారీగా ఓటర్లను నమోదు చేయించాయి పార్టీలు. ఇప్పటి వరకు 26 వేల మంది కొత్తగా ఓటర్లుగా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత స్క్రూట్నీ వుంటుంది. మునుగోడులో 2 లక్షల 27 వేలమంది ఓటర్లు వున్నారు. కొత్త ఓట్ల నమోదుతో ఓటర్ల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్త ఓటర్ల నమోదుకు ఇవాళే చివరి రోజు. మునుగోడు ఉపఎన్నికతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియామవళిని అమలు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇకపోతే.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మునుగోడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ నవంబర్ 8తో ముగియనుంది. 

Also REad:మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రణాళికులు రచించాయి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశాయి. బీజేపీ తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపనుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇదిలా ఉంటే.. ఇప్పటికే అన్ని పార్టీలు మునుగోడులో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్ మునుగోడులో ఇదివరకే బహిరంగ సభ నిర్వహించగా.. మరో సభకు కూడా హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్షేత్ర స్థాయిలో కూడా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మునుగోడులో బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే కొద్ది రోజులుగా మునుగోడు ఉపఎన్నికపై ఏర్పాటైన బీజేపీ స్టీరింగ్ కమిటీ వరసుగా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారాన్ని ఉధృతం చేసేలా ప్రణాళికలు రచిస్తుంది. 

కాంగ్రెస్ విషయానికి వస్తే.. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా పదిలంగా ఉంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. క్షేత్ర స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో పలు సమావేశాలను ఏర్పాటు చేసి.. ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.  

click me!