మునుగోడు అసెంబ్లీ స్థానంలో కోమటిరెడ్డికి తిప్పలు తప్పేలా లేవు. బలమైన వర్గం ఉన్న పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి షాక్ వంటిదే. దీని ప్రభావం కోమటిరెడ్డిపై తప్పక పడుతుంది. దీనికితోడు మునుగోడులో వామపక్షాలకు మంచి ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ సీపీఎం దోనూరి నర్సిరెడ్డిని నిలబెట్టింది.
హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి టికెట్ దక్కకపోవడంతో ఆమె అప్పటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. తాజాగా, ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కోమటిరెడ్డికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తున్నది. దీనికితోడు ఈ ఎన్నికల్లో సీపీఎం కూడా మునుగోడులో తమ అభ్యర్థిని ప్రకటించింది.
చివరి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ పాల్వాయి స్రవంతి తాజాగా రాజీనామా చేశారు. మునుగోడు టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారు. ఆయనే ఇప్పుడు బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా పాల్వాయి స్రవంతికి పార్టీలో మంచి క్యాడర్ ఉన్నది. ఆమె తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన మరణానంతరం స్రవంతి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ వారు స్రవంతికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా, ఆమె పార్టీ మారడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తలనొప్పులు ఎదురయ్యాయి.
గత ఉపఎన్నికలో వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. బీఆర్ఎస్ గెలుపులో వామపక్షాల మద్దతు పని చేసిందని చెబుతారు. మునుగోడులో వామపక్షాలకు ఓటు బ్యాంకు ఉన్నది. ఇప్పటికీ వామపక్షాలకు ఓటు వేసే వారు మునుగోడులో ఎక్కువగా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్నప్పటికీ సీపీఎం మాత్రం అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో వామపక్షాల ఓటు కాంగ్రెస్‌కు కలిసి రాకపోవచ్చు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.