
కరీంనగర్: తన నియోజకవర్గంలో ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరిగింది... కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎందుకు జరగలేదు? అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. తనలాగే ఇక్కడి ఎమ్మెల్యే కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు... అయినా ఇక్కడి నిరుపేదలకు ఎందుకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టివ్వలేదు? అని ఎర్రబెల్లి నిలదీశారు.
మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కందుగుల ఎస్సి కాలనీని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
నలభై వేల కోట్లు పెట్టీ మిషన్ భగీరథ నీళ్ళు ఇంటిటికి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎస్సి కాలనిలో కూడా కొత్త వాటర్ ట్యాంక్, పైపులు వేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఎస్సి కాలనీలో సీసీ రోడ్ల అభివృద్ధికి రూ.25 లక్షలు నిధులు మంజూరు చేశారు.
read more టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరుతా: తేల్చేసిన ఎల్. రమణ
''పల్లె ప్రగతి జరుగుతున్న గ్రామాల్లో తుప్పు స్తంభాలు, వంగిన స్తంభాలు, వైర్లు జారిన స్తంభాలు లేకుండా చూసే బాధ్యత విద్యుత్ అధికారులదే. అర్హులైన ప్రజలకు ఆసరా పింఛన్లు అందేలా చూడాలి'' అని ఎర్రబెల్లి ఆదేశించారు.
''గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన నాయకుడి వల్లే గ్రామాల్లో సమస్యలు. హుజురాబాద్ కు 4వేల ఇండ్లు మంజూరైన ఒక్క ఇల్లు కూడా లభ్డిదారులకు ఎందుకు అందలేదు'' అంటూ ఈటలపై విమర్శలు గుప్పించారు ఎర్రబెల్లి.
''తనకు మొదట రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎన్టీఆర్. కానీ మరోసారి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది మాత్రం ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వీరిద్దరి వల్లే నాకు ప్రజాసేవ చేసుకునే అవకాశం లభించింది'' అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.