సీన్ ఛేంజ్: అవును.. వాళ్లిద్దరూ కలిసిపోయారు

By narsimha lodeFirst Published Oct 5, 2018, 4:23 PM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య రాజీ కుదిరింది.


నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య రాజీ కుదిరింది. తాజా మాజీ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి,టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి ల మధ్య శుక్రవారం నాడు  రాజీ కుదిరింది.  మంత్రి కేటీఆర్ సమక్షంలో  వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది.

2014 ఎన్నికల సమయంలో  భువనగిరి నుండి  టీఆర్ఎస్ అభ్యర్థిగా పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పలు మార్లు పోటీ చేసిన చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు.

2014  ఎన్నికల తర్వాత  రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చింతల వెంకటేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.  2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కూడ ఆరు మాసాల క్రితమే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

అయితే భువనగరి తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ... చింతల వెంకటేశ్వర్ రెడ్డి మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తలు బుజ్జగింపు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకత్వం చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు పైళ్ల శేఖర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డిలు  మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. పైళ్ల శేఖర్ రెడ్డికి సహకరించాలని  మంత్రి కేటీఆర్ చింతల వెంకటేశ్వర్ రెడ్డికి సూచించారు. ఇందుకు చింతల వెంకటేశ్వర్ రెడ్డి కూడ  అంగీకరించాడు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పరస్పరం కరచాలనం చేసుకొన్నారు. 
 

click me!