
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని గతంలో నిర్ణయించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఈ విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఓయూ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు డాక్టరేట్ ప్రదానం చేయాలని ఓయూ పాలకమండలి గతంలోనే నిర్ణయించింది.
గత 15 ఏళ్లుగా ఎవరికీ ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ ఇవ్వలేదు. 2001 లో ఇండో అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్ ఎన్ నేత్రావలి కి చివరి సారిగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఒక వేళ కేసీఆర్ కు .. గౌరవ డాక్టరేట్ ఇస్తే అంబేద్కర్ తర్వాత వర్సిటీ నుంచి ఈ గౌరవం అందుకున్న రెండవ రాజకీయ వేత్తగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. 1953 లో అంబేద్కర్ ను ఓయూ గౌరవ డాక్టరేట్ తో సన్మానించిన విషయం తెలిసిందే.
కాగా, సీఎం కేసీఆర్ కు డాక్టరేట్ ఇవ్వడంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని వర్సిటీ వైస్ చాన్సెలర్ ఎస్. రామచంద్రం తెలిపారు. డాక్టరేట్ విషయమై సీఎం తో చర్చించాకే దీనిపై తుది నిర్ణయానికి రావాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.