తెలంగాణలో మోదీ పర్యటన వేళ ముందస్తు అరెస్ట్‌లు.. మోదీ గో బ్యాక్ అంటూ ఓయూలో నిరసనలు..

By Sumanth KanukulaFirst Published Nov 12, 2022, 12:38 PM IST
Highlights

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కాక రేపుతోంది. మోదీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు.

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కాక రేపుతోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం, సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపడం, ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా  అరెస్ట్‌ల పర్వం  కొనసాగుతుంది. మోదీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. మోదీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్‌వీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సీపీఐ నేతల నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకనున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారు నిరసనను కొనసాగిస్తున్నారు. ఇక, గోదావరిఖని 11వ గని వద్ద ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యను ఇతర నాయకులను అరెస్టు చేశారు.

మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో పలుచోట్ల కార్మికులు ఆందోళనలు  చేపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్‌పూర్‌, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లజెండాలను ఎగురవేశారు. మోదీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

ఇదిలా ఉంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు మొత్తంగా రూ.9500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ మొదట పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండంకు హెలికాఫ్టర్‌లో చేరుకోనున్నారు. అక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను(ఆర్ఎఫ్‌సీఎల్) జాతికి అంకితం చేయనున్నారు. 

ఆర్ఎఫ్‌సీఎల్‌ను సందర్శించిన అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ.. ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

click me!