
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ శుక్రవారం ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు సూర్యచందర్, కట్ల వెంకట్ మాట్లాడుతూ.. తాము గత పాతికేళ్లుగా ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని చెప్పారు. కానీ తమ ఉద్యోగాలకు భద్రత లేదని.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 16 ప్రకారం తమని రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఓయూ రిజిస్ట్రార్ తక్షణం స్పందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.