మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయమై టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయమై టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది.మునుగోడు ఉపఎన్నికల్లో తమపార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించవద్దని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజుకు గత వారంలో టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది.ఈ విషయమై ఈసీ నుండి సరైన స్పందన రాలేదని టీఆర్ఎస్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.అయితే అత్యవసరంగా ఈ పిటిషన్ ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇవాళ ఉదయం ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది.ఈసీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, టీవీ, కుట్టు మిషన్, పడవ వంటి గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ తరహా గుర్తుల కారణంగా తమ పార్టీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.దీంతో ఈ గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయిచవద్దని కోరుతున్నారు.
మునుగోడులో 38 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు .ఇండిపెండెంట్లకు టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన గుర్తులను కేటాయించే అవకాశం ఉంది. ఈ విషయమై నిన్న రాత్రి చండూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు టీఆర్ఎస్ ధర్నాకు దిగింది. రోడ్డు రోలర్ వంటి గుర్తును ఇండిపెండెంట్ ఎంపిక చేసుకున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.అయితే టీఆర్ఎస్ అభ్యంతరాలకు సంబంధించి ఈసీఐకి సమాచారం పంపినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెబుతున్నారు.ఈసీ నుండి స్పష్టత రాగానే ఇవాళ సాయంత్రం లోపుగా గుర్తులను కేటాయించనున్నట్టుగా ఈసీ తెలిపింది.
టీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టివేసింది. దీంతో ఈసీకి ఈ గుర్తుల కేటాయింపుపై లైన్ క్లియరైనట్టేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయమై టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి.
వచ్చే నెల 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఆగస్టు 8 వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు నాలగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
alsoread:మునుగోడు బైపోల్ 2022:గట్టుప్పల్ వద్ద కారులో రూ. 19 లక్షలు స్వాధీనం
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మునుగోడులో ఇప్పటివరకు 12దఫాలు ఎన్నికలు జరిగితే 6 దఫాలు కాంగ్రెస్ ,ఐదు దఫాలు సీపీఐ అభ్యర్ధులు, ఒక్కసారి టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు.