
తెలంగాణ సర్కారుకు హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. జిఓ నెం. 1274ను పక్కనపెట్టింది హైకోర్టు. 1274 జిఓ లింగవివక్ష చూపేలా ఉందని హైకోర్టుకు నిరుద్యోగులు వెళ్లారు. దీంతో ఆ జిఓ అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గురుకుల విద్యాలయాల నియామకాల కోసం తెలంగాణ సర్కారు ఆ జిఓను వెలువరించింది. అయితే గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించేలా ఈ జిఓ ఉపకరిస్తుందని నిరుద్యోగులు అంటున్నరు.
దీంతో గురుకుల నియామకాల్లాలో లింగవివక్ష చూపే జిఓ 1274ను కొట్టివేయాలంటూ నిరుద్యోగ జెఎసి హైకోర్టును ఆశ్రయించింది. నిరుద్యోగుల తరుపున సీనియర్ అడ్వకేట్ సరసాని సత్యం రెడ్డి వాదించారు. తెలంగాణ సర్కారు దురుద్దేశపూర్వకంగా ఈ జిఓను తీసుకొచ్చి ఆడ, మగ మధ్య వైశమ్యాలు పెంచేవిధంగా ఉందని నిరుద్యోగులు అంటున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 18నుంచి22వరుకు జరగుతున్న గురుకుల మెయిన్స్ పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. మెయిన్స్ పరీక్ష రాస్తున్న 36వేల మంది అభ్యర్థుల భవిష్యత్తు అయోమయంలో పడిందని అభ్యర్థులు అంటున్నారు. వీరితోపాటు భాషా పండితులైన తెలుగు,ఇంగ్లీషు, హిందీ, ఉర్థూ భాష పండితులు కూడా ఆందోళనలో ఉన్నారు.
2016లో జూన్ 4వ తేదన సిఎస్ రాజీవ్ శర్మ 1274 జిఓ జారీ చేశారు. ఆ జిఓలో గురుకుల విద్యాలయాల్లో నియామకాల తీరు గురించి వెల్లడించారు. బాలికల, బాలుర గురుకుల పాఠశాలల్లో నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జిఓ అది. దీంతో ఇప్పుడు గురుకుల ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు తెలంగాణ సర్కారు. అదే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పదివేల టీచర్ పోస్టులను భర్తీ చేసింది. కానీ తెలంగాణ సర్కారు నిరుద్యోగులైన బిఇడి, డిఇడి అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటిష్టమైన విధానంలో డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టేవారు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం టిఎస్పిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అంటూ కాలయాపన చేసింది. గైడ్ లైన్స్ పేరుతో, రకరకాల పేర్లతో మూడేళ్లు నానబెట్టింది. తీరా అంత కసరత్తు చేసిన తర్వాత చేపట్టిన ఈ పోస్టుల భర్తీ కోర్టుల్లో నలుగుతోందని బాధితులు చెబుతున్నారు.
ఇక తెలంగాణ సర్కారు మెడపై కత్తి పెట్టింది సుప్రీంకోర్టు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టకపోవడాన్ని మాండమస్ గా పరిగణిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షమే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ సర్కారు మాత్రం టెట్ అని, గైడ్ లైన్స్ అని, టిఎస్పిఎస్సీ అని డిఎస్సీ అని దోబూచులాడుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అభ్యర్థులు రగిలిపోతున్నారు.
మరోవైపు జిఓ నెం.1274 ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి మాయం చేశారని, ఇది సర్కారు చేతగాని తనానికి నిదర్శనమని నిరుద్యోగ జెఎసి నేత కోటూరు మానవత్ రాయ్ విమర్శించారు. తెలంగాణ తెచ్చుకుంది కెసిఆర్ ఇంట్లో ఉద్యోగాలు నింపుకోవడానికేనా అని ఆయన ప్రశ్నించారు. కడుపు మండిన తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడానికి నానా రకాల నిబంధనలు, డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు.