తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

First Published Aug 30, 2017, 4:13 PM IST
Highlights
  • బిఇడి చదివిన ఉపేందర్ ఆత్మహత్య
  • ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన

ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న బాధతో ఖమ్మం జిల్లాలో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లాలో రామకృష్ణ అనే టీచర్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

జీవితంపై విరక్తి చెందిన 27 ఏళ్ల హాలావత్ ఉపేందర్ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కోక్యాతండలో జరిగింది. తండాకు చెందిన హాలావత్‌ ఉపేందర్‌ బీఈడీ చదువుకున్నాడు. కొంతకాలంగా ఉద్యోగ అన్వేషణ చేస్తున్నాడు. ఈక్రమంలో నేలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా కాంట్రాక్ట్‌ ఉద్యోగం సంపాదించాడు. ఇటీవల 20రోజుల క్రితం కుటుంబసభ్యులు ఇదే మండలానికి చెందిన ఒక యువతితో వివాహ నిశ్చయం చేశారు. జీవితంలో ఇంకా స్ధిరపడకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదని పదేపదే మదన పడేవాడు.

ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మృతుడి సోదరుడు ఇంట్లోనే నిద్రిస్తున్నాడు. నిద్ర లేచిన అనంతరం ఉపేందర్‌ దూలానికి వేలాడుతుండటంతో వెంటనే కిందకు దింపి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కూసుమంచి ఎస్‌ఐ రఘు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!