బస్సు యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరుద్యోగులతో కలిసి ఇవాళ భూపాలపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
వరంగల్: భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారంనాడు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర నిన్న రాత్రి భూపాలపల్లికి చేరుకుంది . రాత్రి భూపాలపల్లి జెన్ కో అతిథి గృహంలో రాహుల్ గాంధీ బస చేశారు. ఇవాళ ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదవ గని నుండి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ సెంటర్ లో కొద్దిసేపు రాహుల్ గాంధీ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు.అనంతరం రెండో రోజూ బస్సు యాత్ర భూపాలపల్లి నుండి కాటారం వరకు సాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర సాగనుంది. రేపటితో తొలి విడత బస్సు యాత్ర ముగియనుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కర్ణాటక ఫార్మూలాను తెలంగాణలో ఆ పార్టీ అమలు చేస్తుంది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు బస్సు యాత్రను కాంగ్రెస్ చేపట్టింది.