భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకంట్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: పొత్తులపై తాను నిన్న చేసిన వ్యాఖ్యలను మాణిక్ రావు ఠాక్రే లైట్ గా తీసుకున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డ వెంకట్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వాళ్లు కూడా తన వీడియోను పూర్తిగా చూడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దని తాను ఠాక్రేకు చెప్పానన్నారు. బీఆర్ఎస్ తో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరగలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
also read:ఏం మాట్లాడారో తెలియదు.. ఆ వీడియో చూశాకే యాక్షన్ : కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణిక్ రావ్ థాక్రే
గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టపోయినట్టుగా ఠాక్రేకు వివరించినట్టుగా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని పార్టీ నాయకత్వాన్ని కోరామన్నారు. పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. మీడియాలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు.
పార్టీని ఎలా గెలిపించాలనే దానిపై ఠాక్రేతో చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందుగానే టికెట్లు కేటాయించాలని తాను కోరినట్టుగా చెప్పారు. గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలని కూడా కోరామన్నారు.
2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్లు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగేలా ఉన్నాయని పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.