నిజాంకు గోల్కొండ ఖిల్లా ఎలానో...టీఆర్ఎస్‌కు ఈ నియోజకవర్గం అలా : కవిత

By Arun Kumar PFirst Published Sep 26, 2018, 6:21 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా వున్న బాల్కొండ నియోజకవర్గంలో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని నిజామాబాద్ ఎంపి దిమా వ్యక్తం చేశారు. నిజాం నవాబులను ఓడించి గోల్కొండ ఖిల్లాను వశపర్చుకోడానికి ఎంతో మంది రాజులు ప్రయత్నించి విఫలమయ్యారని ఎంపి గుర్తుచేశారు. అలాగే టీఆర్ఎస్ కు కంచుకోటలా వున్న బాల్కొండ లో గెలవాలని ప్రయత్నిస్తూ విపక్ష పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయని కవిత ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా వున్న బాల్కొండ నియోజకవర్గంలో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని నిజామాబాద్ ఎంపి దిమా వ్యక్తం చేశారు. నిజాం నవాబులను ఓడించి గోల్కొండ ఖిల్లాను వశపర్చుకోడానికి ఎంతో మంది రాజులు ప్రయత్నించి విఫలమయ్యారని ఎంపి గుర్తుచేశారు. అలాగే టీఆర్ఎస్ కు కంచుకోటలా వున్న బాల్కొండ లో గెలవాలని ప్రయత్నిస్తూ విపక్ష పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయని కవిత ఎద్దేవా చేశారు. 

బుధవారం బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కవిత మాట్లాడుతూ...బాల్కొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని అన్నారు. మీ ఎమ్మెల్యే ఎప్పుడూ ముఖ్యమంత్రి వద్ద ఉంటూ పనులు చేయించుకున్నారంటూ ప్రశాంత్ రెడ్డి ని అభినందించారు. 2014 ఎన్నికల్లో 38వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలు...వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని కవిత కోరారు.  

మన ఇంట్లో పెళ్లి జరుగుతున్న విషయం ఊరందరికీ తెలిసినా...ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి శుభలేఖలు ఇస్తామని, అలాగే ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 570 కార్యక్రమాలను వివరించాలని ఎంపి కవిత కోరారు. గొప్ప నాయకుడి సైనికులమయిన మనం చేసిన అభివృద్ది చెప్పుకోక పోతే పార్టీకి నష్టం చేసిన వాళ్ళం అవుతామన్నారు. అతి విశ్వాసం రాకూడదు. ఆత్మ విశ్వాసం ఉండాలి అంటూ రాజు- పాల కథ చెప్పారు. 

అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారు. కొత్తగా చేరిన వారు పాత వారిని కలుపుకొని ముందుకు పోవాలి. కలిసి సాగితే విజయం తథ్యం అని కార్యకర్తలకు ఎంపి కవిత ఉద్బోధించారు.

 బూత్ కమిటీ లు వేసుకుని, సమావేశాలు ఎక్కడివారక్కడ నిర్వహించుకోవాలన్నారు. ప్రతి బూత్ కమిటీ లో మహిళలకు చోటు కల్పించాలని,  ప్రత్యేకంగా బూత్ స్థాయి మహిళా కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రైతన్నలు ఉండే బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క ఎర్రజొన్న మిగలకుండా రూ.42 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని కవిత తెలిపారు.  2 వేల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును తయారు చేసుకుంటున్నామని, రూ.1 వేయి కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జివ పథకంను చేపట్టామని ఎంపి కవిత వివరించారు.
ప్రశాంత్ రెడ్డి సెంచరీ కొట్టి విజయం సాధిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ స్పీకర్ కే.ఆర్ సురేశ్ రెడ్డి అనుచరులకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి వారిని ఆహ్వానించారు ఎంపి కవిత. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపి కవిత, సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు, రాజేశ్వర్, రెడ్ కో చైర్మన్ అలీం, డాక్టర్ మధుశేఖర్, నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

click me!