Nizamabad Crime: కేవలం మూడువేల కోసం కిరాతకం... సుత్తితో తల చితక్కొట్టి ముగ్గురి దారుణ హత్య

By Arun Kumar PFirst Published Dec 13, 2021, 10:20 AM IST
Highlights

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో సంచలనం రేపిన ముగ్గురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మూడువేల కోసమే ముగ్గురికి ఓ దోపిడీ దొంగ చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 

నిజామాబాద్: కేవలం మూడువేల కోసం ముగ్గురిని అతి కిరాతకంగా హతమార్చాడో దోపిడీ దొంగ. అమాయకులను సుత్తితో అతి కిరాతకంగా బాది చనిపోయాక వారివద్ద డబ్బులను దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) ఐదురోజుల క్రితమే చోటుచేసుకోగా తాజాగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.    

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట (naveepet)కు చెందిన  గంధం శ్రీకాంత్ అలియాస్ మల్లేష్(19) చిన్నతనంనుండే నేరాల బాట పట్టాడు. 16ఏళ్ల వయసులోనే ఓ గుడిలో దొంగతనానికి యత్నించగా అడ్డువచ్చిన వాచ్ మెన్ ను చావబాదాడు. ఈ కేసులో అతడి మూడేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో మూడేళ్లపాటు జైల్లోనే వున్న అతడు కొన్నినెలల క్రితమే విడుదలయి నిజామాబాద్ లోనే ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. 

జైలు శిక్ష శ్రీకాంత్ లో ఏమాత్రం మార్పు తీసుకురాలేదు. విడుదలై నెలలు కూడా గడవక ముందే పాత నేర ప్రవృత్తిని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీన నిజామాబాద్ మిర్చి కాంపౌండ్ ప్రాంగణం ఫుల్లుగా మద్యం సేవించిన శ్రీకాంత్ దోపిడీకి బయలుదేరాడు. 

read more  పగబట్టిన మృత్యువు... గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తల్లీ, కూతురు మృతి, తండ్రి, కొడుకు పరిస్థితి విషమం..

అదే రాత్రి బస్సెక్కి డిచ్ పల్లి వెళ్లాడు. అక్కడ ఓ గ్యారేజీలో నిద్రిస్తున్న సంగారెడ్డి జిల్లావాసి బానోతు సునీల్(22) తో పాటు పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్పాల్ సింగ్ (33), జోగిందర్ సింగ్(48) ను గుర్తించాడు. వారివద్ద డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకోవాలని భావించాడు శ్రీకాంత్. మొదట నిద్రిస్తున్న సునీల్ వద్దకు మెల్లిగా జేబులోంచి డబ్బులు తీసుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సునీల్ కు మెలకువ రావడంతో ఎక్కడ అరిచి గోలచేస్తాడోనని భావించి సుత్తితో తలపై బాది అతి కిరాతకంగా హతమార్చాడు. 

రక్తపుమడుగులో పడిపోయిన సునీల్ వద్ద గల డబ్బులు, సెల్ ఫోన్ ను శ్రీకాంత్ తీసుకున్నాడు. ఆ తర్వాత అదే సుత్తితో గాఢనిద్రలో వున్న పంజాబ్ వాసులు హర్పాల్ సింగ్, జోగిందర్ సింగ్ లపై కూడా దాడి చేసాడు. వారివద్ద డబ్బులు, సెల్ ఫోన్లను తీసుకుని అక్కడినుండి పరారయ్యాడు. 

ఉదయం గ్యారేజీలో ముగ్గురు రక్తపు మడుగులో పడివుండటాన్ని గమరనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు గ్యారేజీ సమీపంలోని సిసి కెమెరాల ఆధానంగా దర్యాప్తు చేపట్టారు. అలాగే పాత నేరస్తులపై నిఘా పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా శ్రీకాంత్ పట్టుబడ్డాడు. అతడిపై అనుమానంతో తమదైన రీతిలో పోలీసులు విచారించగా హత్యలు చేసినట్లు అంగీకరించాడు. 

read more  మహిళా సర్వేయర్‌ పట్ల అనుచిత ప్రవర్తన: గుండాల తహసీల్దార్ దయాకర్‌ రెడ్డిపై వేటు

దోచుకున్న మూడువేల నగదు ఖర్చయిపోయినట్లు తెలిపాడు. అయితే సెల్ ఫోన్లను మాత్రం తన గదిలో దాచినట్లు శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. దీంతో అతడు అద్దెకుంటున్న గదిలో తనిఖీ చేసిన పోలీసులు రక్తపు మరకలతో వున్న చొక్కాతో పాటు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన ఈ నేరస్తున్ని సోమవారం న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నట్లు నిజామాబాద్ పోలీసులు తెలిపారు. 

 
 

click me!