రేవంత్ కుర్చీని లాక్కోవాలని కోమటిరెడ్డి, ఉత్తమ్ స్కెచ్ : ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 29, 2024, 10:04 PM IST
Highlights

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని లాక్కోవడానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి  కాచుకుని కూర్చొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కొమురం భీమ్ క్లస్టర్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని లాక్కోవడానికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాచుకుని కూర్చొన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వుంటుందో, పోతుందో తెలియదని .. రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఒకటేనని అర్వింద్ ఆరోపించారు.

వీరిద్దరూ కలిసే నిజామాబాద్ అభ్యర్ధిని ఎంపిక చేశారని.. రైతుబంధు నిధుల నుంచి కోమటిరెడ్డి రూ.2 వేల కోట్లు, పొంగులేటి రూ.3 వేల కోట్ల నుంచి తమ బిల్లులు వసూలు చేసుకున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని.. తెలంగాణలో బీజేపీ 14 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. 

ఇదిలావుండగా.. బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ రాములు గురువారం బీఆర్ఎస్‌లో చేరారు. ఢిల్లీలో తన కుమారుడు భరత్‌తో కలిసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ల సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. పేదరికానికి వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారని.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపచేస్తున్నారని రాములు ప్రశంసించారు. సమాజం కోసం పనిచేస్తున్న వారు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి బీజేపీలో చేరుతూనే వున్నారని రాములు అన్నారు. 

click me!