
తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన నిజాం మ్యూజియం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. గుల్బార్గాలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని.. బంగారు టిఫిన్ బాక్స్‌తో పాటు మిగిలిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 10 రోజుల క్రితం పాతబస్తీలోని నిజాం మ్యూజియంలోకి చాకచక్యంగా ప్రవేశించిన దుండగులు కోట్లాది రూపాయలు విలువ చేసే చారిత్రక వస్తువులను దొంగిలించారు.
ఎప్పటిలాగానే ప్రజల సందర్శన అయిన తర్వాత సెప్టెంబర్ 2 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు మ్యూజియానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సోమవారం ఉదయం మ్యూజియం గ్యాలరీ తలుపు తెరిచేసరికి విలువైన వస్తువుల కనిపించలేదు. గ్యాలరీ వెంటిలేటర్ నుంచి తాడు వేలాడుతూ కనిపించడంతో.. చోరీ జరిగిందని నిర్థారించుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... దుండగులు మ్యూజియం మొదటి అంతస్తులోని వెంటిలేటర్ ఇనుప కడ్డీలను తొలగించారు.
అనంతరం 20 అడుగుల తాడు సాయంతో లోపలికి ప్రవేశించారు. మ్యూజియం లోపల పది సీసీ కెమెరాలు ఉన్నాయి... అయితే ఒక్క సీసీ కెమెరాకు సైతం చిక్కకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు.మ్యూజియం సమీపంలో వెంటిలేటర్‌ను చిత్రీకరించేలా ఉన్న కెమెరా దిశను దుండగులు మార్చివేశారు. పై నుంచి లోపలికి దిగే క్రమంలో దుండగుడు సీసీ కెమెరాపై కాలు పెట్టడంతో అది ధ్వంసమైంది.
అయితే ఒక కెమెరాలో మాత్రం దుండగుడు సంచరిస్తున్న దృశ్యం నమోదైంది... అతడి వీపు మాత్రమే కనిపిస్తుండటంతో స్పష్టత లేకుండా పోయింది. దొంగతనం జరిగిన తీరు.. దుండగులు లోపలికి ప్రవేశించిన తీరు పక్కా స్కెచ్‌తోనే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. కేసును తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరిలో ఎట్టకేలకు ఇద్దరు దొంగలు దొరికారు.
నిజాం మ్యూజియంలో భారీ చోరీ.. విలువైన వస్తువులు అపహరణ
పటిష్ట భద్రతను ఛేదించి... నిజాం మ్యూజియంలో దొంగతనం ఎలా సాధ్యమైంది..?