
తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేసిన ఆ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని ప్రశంసించారు. భూమి, జీవనాధారాల కోసం పోరాడిన ఆదివాసీలను గుర్తు చేస్తూ, వారి త్యాగాలను కొనియాడారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, రూ.3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలను మెరుగైన రహదారి మౌలిక వసతులతో కలుపుతూ ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్ల అభివృద్ధి కొనసాగుతుందని గడ్కరీ తెలిపారు. వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, రవాణా వ్యవస్థ, మౌలిక వసతులు ఈ నాలుగు అంశాలు దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక రహదారి ప్రాజెక్టులు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయని గడ్కరీ చెప్పారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించడం ద్వారా ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నామని వివరించారు. జోజిలా పాస్ టన్నెల్ వంటి ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణగా చెప్పారు.
తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు పలు కీలక ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సూర్యాపేట - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి, నాగ్‌పూర్ - విజయవాడ కారిడార్, జగిత్యాల - కరీంనగర్ హైవే విస్తరణ వంటివి ఇందులో భాగమేనని వివరించారు.
భద్రాచలం, బాసర, మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను జాతీయ రహదారుల ద్వారా అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు అనేక ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు. అంబర్‌పేట్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హైదరాబాద్ లోని బీహెచ్ ఈఎల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, CNG వాహనాలను ప్రోత్సహిస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. పెట్రోల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలి అని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా రవాణా ఖర్చు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.