బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ముగ్గురు ఇవాళ ప్రమాణం చేశారు. ఈ నెల 16నే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు
హైదరాబాద్:తెలంగాణ శాసన మండలి 'సభ్యులుగా నూతనంగా ఎన్నికైన ముగ్గురితో మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారంనాడు ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి ,దేశపతి శ్రీనివాస్ ,. కూర్మయ్యగారి నవీన్ కుమార్ లతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త ఎమ్మెల్సీలకు
పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్సీలు ఈ నెల 16న ఎన్నికల అధికారుల నుండి ధృవీకరణ పత్రాలు స్వీకరించారు. మొత్తం మూడు స్థానాలకు ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుండి అభ్యర్ధులు ఎవరూ బరిలో లేరు. దీంతో ఈ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు.
ఇవాళ ఉదయం ముందుగా నిర్ణయించిన ముహుర్తం మేరకు బీఆర్ఎస్అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ ఈ దఫా చల్లా వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. ఏపీలోని రాలయసీమలో చల్లా వెంకట్రాంరెడ్డికి పట్టుంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు చల్లా వెంకట్రాంరెడ్డి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఆలంపూర్ అసెంబ్లీ స్థానం నుండి చల్లా వెంకట్రాంరెడ్డి 2004-2009 ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా చల్లా వెంకట్రాంరెడ్డి పనిచేశారు.
also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధుల ఏకగ్రీవ ఎన్నిక
ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.హోంమంత్రి మహమూద్ అలీ,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, యువజన క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,శాసన మండలి ఛీఫ్ విప్ భాను ప్రసాద రావు, విప్ లు ఎం .ఎస్ ప్రభాకర్ రావు,శంబిపూర్ రాజు,కౌశిక్ రెడ్డి,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,దామోదర్ రెడ్డి,వాణీదేవి ,శేరి శుభాష్ రెడ్డి,ఎల్ రమణ ,ఎగ్గే మల్లేశం,దండే విఠల్, రఘోతం రెడ్డి,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, అరికెపూడి గాంధీ,మైనంపల్లి హనుమంతరావు, అబ్రహం, మెతుకు ఆనంద్ కుమార్,రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా'నరసింహా చార్యులు,టి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి,తదితరులున్నారు.