Telangana High Court: తెలంగాణలో హైకోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. నూతన సంవత్సరంలో (వచ్చే జనవరిలో)నే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (MCRHRD) చీఫ్ జస్టిస్, న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.
Telangana High Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం నిర్మాణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో సీఎం రేవంత్ రెడ్డి,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై వీరు చర్చించారు.
ఈ సందర్భంగా హైకోర్టు శిథిలావస్థకు చేరుకుందని చీఫ్ జస్టిస్ .. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఎక్కడ 100 ఎకరాలకంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం వుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో వుందని అధికారులు తెలియజేయడంతో .. అక్కడ కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు.
ప్రస్తుత భవనాన్ని ఏం చేస్తారంటే..?
ప్రస్తుత హైకోర్టు భవనాన్ని వారసత్వ సంపదగా పరిరక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు.. కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చొరవ చూపాలని సీజే ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణాలు అవసరమవుతాయో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఆ భవనాన్ని ఆధునికీకరణ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూడాలని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తో పాటు తదితర అధికారులు పాల్గొన్నారు.