తెలంగాణ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది: శాంతి కుమారి

Published : Jan 11, 2023, 05:19 PM IST
తెలంగాణ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది: శాంతి కుమారి

సారాంశం

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్కేఆర్ భవన్ లో చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. 

తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియమితులయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్కేఆర్ భవన్ లో చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాంతి కుమారి మీడియాతో మాట్లాడారు.  సీఎం కేసీఆర్‌కు థాంక్స్ చెప్పారు. ‘‘నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు దేశానికే తలమానికంగా కొనసాగుతున్నాయి. వాటిని ఎంతో బాధ్యతతో, కర్తవ్యదీక్షతో ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవడం  నాకు ఎంతో సంతోషంగా,  గర్వకారణంగా ఉంది’’ అని చెప్పారు.  తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన అనంతరం శాంతి కుమారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆమెకు అభినందనలు తెలిపారు. 

శాంతి కుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.  ఆమె మెరైన్ బయాలజీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేశారు. అమెరికాలో ఎంబీఏ  చదివారు. రెండు సంవత్సరాలు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలలో కూడా పనిచేశారు. ఆమె గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా.. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, అటవీ శాఖలలో  వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో  ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. టీఎస్‌ ఐపాస్‌లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడానికి ముందు.. శాంతి కుమార్ అటవీ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

ఇక, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి.. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నూతన సీఎస్‌ ఎంపికపై దృష్టి సారించింది. పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు రేస్‌లో ఉన్న సీఎం కేసీఆర్.. శాంతి కుమారి వైపు మొగ్గు చూపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్