
తెలంగాణ జెఎసి ఐదో దశ అమరుల స్పూర్తి యాత్ర సిద్ధమవుతోంది. నాలుగు దశల్లో మూడు దశల యాత్రలు నల్లేరుపై నడక మాదిరిగానే సాగాయి. నాలుగో దశలో అధికార గులాబీ శ్రేణులు అడ్డు తగిలాయి. పోలీసులు వారికి వత్తాసు పలికారు. ఈ నేపథ్యంలో ఐదో దశ అమరుల స్పూర్తి యాత్రకు సరికొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన నాలుగు దశల్లోని యాత్రలు ఒకటైతే రేపటి నుంచి జరగనున్న యాత్ర మరో ఎత్తు కాగా ఐదో దశ మరో ఎత్తుగా చెబుతున్నారు. క్రియాశీల రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది జెఎసి. ఈ నేపథ్యంలో గత నాలుగు యాత్రలు కేసిఆర్ కుటుంబంపై పోరుబాట సాగించినట్లుగా సాగింది. తొలుత హరీష్ రావు నియోజకవర్గం, ఆ తర్వాత కేటిఆర్ ఇలాకాలో తర్వాత సిఎం నియోజకవర్గంలో సాగింది. ఈ మూడు దశల్లో అధికార పార్టీ చూసీ చూడనట్లుగానే వ్యవహరించింది.
తొలిదశకు ఆతర్వాత జరిగిన రెండు, మూడో దశల్లో జనాల్లో జెఎసి పట్ల కదలిలకలు పెరిగాయి. దీంతో ఇక ఉపేక్షించేదిలేదనుకున్న ప్రభుత్వ పెద్దలు ఆదేశాలిచ్చారు. దీంతో నాలుగో దశ రచ్చ రచ్చ అయింది. అధికార పార్టీ, పోలీసులు కలిసి దాడులు చేశారని జెఎసి ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐదో దశ అమరుల స్పూర్తి యాత్రకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయా అని జెఎసి అనుమానిస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో జెఎసి యాత్రకు మూడు ప్రధాన సవాళ్లు ఎదురయ్యే అకవాశాలున్నాయి.
1 ఈ యాత్ర కోదండరాం సొంత జిల్లాలో జరుగుతుంది. ఆయన పుట్టి పెరిగిన జిల్లా కాబట్టి గత నాలుగు యాత్రల కంటే ఈ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జెఎసి. గతంలో కంటే ఈసారి జనాలను భారీగా కదిలించచాల్సిన సవాల్ జెఎసి మీద ఉంది.
2 ఇక ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ వారే ఉన్నారు. దీంతో యాత్రకు అధికార పార్టీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలుంటాయా అన్న అనుమానాలున్నాయి. ఒకవేళ అలాంటి అవాంతరాలు ఎదురైతే వాటిని అధిగమించి యాత్రను చేపట్టడం జెఎసికి రెండో సవాల్ గా చెప్పవచ్చు.
3 తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జంప్ జిలానీలపై అన్న పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఎటు పోతే ఏ పార్టీ బలోపేతం అవుతుంది. ఏ పార్టీ బలహీనం అవుతుంది అన్నది కొద్దిరోజుల్లోనే తేలే చాన్స్ ఉంది. దీనికితోడు జెఎసి కూడా రాజకీయ రూపుదాలుస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ సమయంలో ఐదో దశ మరింత కీలకం అవుతుందని చెప్పవచ్చు.
మరి ఈ మూడు సవాళ్లను జెఎసి ఎలా ఎదుర్కుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి