మూసీ వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రాత్రంతా కష్టపడి కాపాడింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
హైదరాబాద్ : హైదరాబాద్ లో మూసీ నది వరల్లో చిక్కుకున్న ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది రక్షించారు. గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌస్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరదలు రావడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో మంగళవారం రాత్రంతా కష్టపడి సహాయ సిబ్బంది ఫాంహౌస్ లో చిక్కుకుపోయినవారిని రక్షించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, హైదరాబాదులో కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన భారీ వర్షాలు మంగళవారం కూడా కొనసాగడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధ, గురువారాల్లో భారీవర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
undefined
వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని.. చాకచక్యంగా కాపాడిన పోలీసులు...(వీడియో)
హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన వరుణుడు.. మంగళవారం కూడా అలాగే కొనసాగించాడు. దీంతో చాలాచోట్ల చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగు నీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూకట్పల్లి, బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్, బహదూర్ పుర, ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం ప్రబలింది. బురద మేటలు వేసింది. కూరగాయల మార్కెట్లు, కాలనీ రహదారులు చెత్త చెదారంతో నిండిపోయాయి.
ముఖ్యంగా నగరానికి 80% మాంసాన్ని సరఫరా చేసే జియా గూడా కబేల పరిసరాలు ఆందోళన కరంగా మారాయి ఎంజీబీఎస్, హైకోర్టు, ముసారాంబాగ్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థితిలో మూసీ వరద ఉంది. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిషేధించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసి, కాగ్నానది లకు పెద్ద ఎత్తున వరద వచ్చి.. ఇల్లు, పంటలు నీట మునిగిపోయాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోకి సైతం వరద నీరు వచ్చింది. మరోసారి రికార్డు స్థాయిలో జంట జలాశయాల్లో అయినా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు వరద పోటెత్తుతోంది.
మంగళవారం రాత్రి 10 గంటల వరకు 13 వేల క్యూసెక్కులను మూసి లోకి విడిచి పెడుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగుకు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది. తొగరపు చెరువు వరదలో 10 కుటుంబాలు చిక్కుకున్నాయి.
వికారాబాద్ జిల్లా బొంరాస్పేటకు చెందిన అరవింద్ గౌడ్ చాంద్రాయణ గుట్టలోని తన బంధువుల ఇంటికి వెడుతూ వరదలో చిక్కుకున్నాడు. గ్రామంలో విద్యుత్ సమస్య ఉండడంతో.. బీటెక్ చదువుతున్న అరవింద్.. పరీక్షలు దగ్గరపడుతుండడంతో చదువుకోవడానికి బంధువుల ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.