
తెలంగాణలోని మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పలు కోర్సుల అడ్మిషన్లను జాతీయ వైద్య మండలి రద్దు చేసింది. అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగానే ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, వికారాబాద్‌లోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పఠాన్‌చెరులోని టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. దీంతో ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌లో ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రద్దు చేయగా, మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో PG సీట్లు రద్దు చేయబడ్డాయి. TRR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మొదటి రెన్యూవల్, రెండవ బ్యాచ్ అడ్మిషన్ కోసం అనుమతి లేఖను కూడా జాతీయ వైద్య మండలి ఉపసంహరించుకుంది.
జాతీయ వైద్య మండలి ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా కొన్ని కాలేజ్‌ల్లో తనిఖీలు చేసి నివేదిక సిద్దం చేసింది. మరోవైపు ఈ ఏడాది మే మొదటి వారం వరకు యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే అడ్మిషన్లు ముగిసిన తర్వాత మే 19న మూడు కాలేజ్‌ల్లో పలు కోర్సుల్లో అడ్మిషన్లు రద్దు చేస్తూ ఎంఎన్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయ్యాక ఎన్‌ఎంసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే తాము విద్యార్థులను చేర్చుకోవడమే కాకుండా.. మే రెండో వారంలో ఎన్‌ఎంసీకి తుది జాబితాను పంపామని ఆయా కాలేజ్ యజమాన్యాలు తెలిపాయి. వైద్య మండలి నిర్ణయంతో ఎంఎన్‌ఆర్ కాలేజ్‌పై భారీ ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే.. ఈ కాలేజ్ అందిస్తున్న పాథాలజీ, అనాటమీ, ఆప్తాల్మాలజీ, బయోకెమిస్ట్రీ వంటి స్పెషలిస్ట్ కోర్సులలో PG సీట్లతో పాటు MBBS కోర్సును రద్దు చేయడమే ఇందుకు కారణం. అయితే వైద్యమండలి అడ్మిషన్ల రద్దు నిర్ణయం మే 19న తీసుకున్నందున్న.. ఎన్‌ఎంసీ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లనున్నట్టుగా ఎంఎన్‌ఆర్ కళాశాల వర్గాలు తెలిపినట్టుగా డెక్కన్ క్రానికల్ పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియ సమయంలో ఉన్న అనుమతి ప్రకారమే.. అడ్మిషన్లు జరిగినందున విద్యార్థులు ఇబ్బంది పడకూడదని వారు చెప్పారు.
కౌన్సెలింగ్‌కు ముందే తనిఖీలు చేసి, గుర్తింపు రద్దుచేసి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆ కాలేజ్‌ల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు చెప్పారు. ఎంఎన్‌సీ తాజా నిర్ణయంతో తమ భవిష్య త్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.