
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆగస్ట్ 27 నుండి పాదయాత్ర చేపట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఇటీవల తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రేపటిలోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బుధవారం హైదరాబాద్ విద్యానగర్ లోని బిసి భవన్ లో ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసి కమిటీ ఛైర్మన్ శ్యామలమ్మ, కో ఛైర్మన్ కృపాకర్ ల అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున తాను పోరాటానికి సిద్దమని ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.
read more Huzurabad Bypoll:కేసీఆర్ కాదు ఆయన జేజమ్మ కూడా ఏం చేయలేదు: ఈటల సంచలనం
ఇక ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోకపోతే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతామని వారు ప్రకటించారు.
ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున తాను ప్రచారం చేస్తానని ఆర్. కృష్ణయ్య గతంలోనే హామీ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం పాదయాత్రకు సిద్దమయ్యారు.
త్వరలోనే హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న 760 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొలగించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికను తమ ఆందోళనలకు అస్త్రంగా వాడుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు భావిస్తున్నారు.