
హైదరాబాద్: తన ఛాలెంజ్‌కి కట్టుబడి ఉన్నానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తేల్చి చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఏది మాట్లాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇక తాట తీసుడేనని ఆయన హెచ్చరించారు.
బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మంత్రి మల్లారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు.పీసీసీ చీఫ్ పదవితో పాటు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన చెప్పారు. తన 13 విద్యా సంస్థల్లో ఎలాంటి అవకతవకలు లేవని ఎంహెచ్ఆర్‌డీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇద్దరం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకొందామని ఆయన సవాల్ విసిరారు.
మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్ష ముగింపు సభలో రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి విద్యా సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని విమర్శించారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి ప్రభుత్వం అక్రమంగా కేటాయించిందని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన చెప్పారు. ఒకవేళ ఈ ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. రేవంత్ రెడ్డిని కూడ రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు.
ఈ రాజీనామా విషయం పార్టీతో చర్చించలేదన్నారు. రేవంత్ చేసిన విమర్శలకు స్పందిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని ఆయన చెప్పారు.మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ రాత్రి ఆయన నివాసం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. దీంతో గురువారం నాడు ఉదయం మంత్రి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.