ఉత్తరాదిలో దళితులపై కొనసాగుతున్న దాడులకు మోడీయే కారణం: కేసీఆర్

By Mahesh Rajamoni  |  First Published Nov 2, 2023, 4:00 AM IST

KCR: ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చి పట్టిందని కేసీఆర్ విమర్శించారు. 'ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎల్ఐసీ నుంచి రైల్వేలు, విమానాశ్రయాల వరకు మోడీ సర్కారు ప్రైవేటీకరణ బాటలో పయనిస్తోందని కేసీఆర్ మండిప‌డ్డారు.
 


Telangana Assembly Elections 2023: ఉత్తర భారతంలో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై కొనసాగుతున్న దాడులకు ప్రధాని నరేంద్ర మోడీ కారణమని భార‌త రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు దళితులను కేవలం ఓటు బ్యాంకులుగా చూస్తున్నాయనీ, వారికి సాధికారత కల్పించడానికి ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని అన్నారు. బుధవారం సత్తుపల్లి, ఇల్లందులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితుల దుస్థితిని, ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులను చూసి తెలంగాణకు దళిత బంధు పథకానికి రూపకల్పన చేశానని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళిత వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేద‌న్నారు.

"ఉత్తర భారతంలో దళితులపై ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ దుస్థితి ఏమిటి? మనది ప్రజాస్వామ్య దేశమా? ఈ అరాచకం ఎందుకు" అని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల సాధికారత కోసం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల సమకాలీన అవసరాలకు అనుగుణంగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించ‌డానికి దీనిని తీసుకువ‌చ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

Latest Videos

మోడీ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని భావించిందని పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ.5 వేల కోట్లు నష్టపోయినా అనుమతించలేదని అన్నారు. ఒక రైతుగా త‌న‌కు అన్న‌దాత‌ల సమస్యలు తెలుసు, రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని ఖమ్మం ప్రజలను హెచ్చరించారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని, రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలను కూడా ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి ఏమీ తెలియదనీ, ఎవరో రాసిన స్క్రిప్టులను మాత్రమే చదువుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గంటల విద్యుత్ ఇస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణలో ఇలాంటి ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు.

click me!