తెలంగాణలో ఇక నంది అవార్డులుండవు... గద్దర్ అవార్డులు మాత్రమే : రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

By Arun Kumar P  |  First Published Aug 13, 2023, 8:04 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలుగు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 


హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా యుద్దసనౌక గద్దర్ కు సముచిత గౌరవం అందిస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.తన ఆట పాటలతో ప్రజలకోసం అలుపెరగని పోరాటం చేసి ఇటీవలే మృతిచెందిన గద్దర్ చిరకాలం గుర్తిండిపోయేలా ఆయన పేరిట అవార్డులు అందిస్తామని అన్నారు. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు,  సాంకేతిక నిపుణులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. 

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన మహోన్నతమైన వ్యక్తుల విగ్రహాలు కలిగిన హుస్సేన్ సాగర్ తీరంలో గద్దర్ విగ్రహాన్ని కూడా పెట్టనున్నట్లు రేవంత్ వెల్లడించారు. తన పాటతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గద్దర్ చైతన్యం నింపారని... అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేసుకుని గౌరవిస్తామని అన్నారు. భవిష్యత్ తరాలకు గద్దర్ గొప్పతనం తెలిసేలా విగ్రహ ఏర్పాటు వుంటుందన్నారు.  

Latest Videos

హైదరాబాద్ బోయినిపల్లి లోని  గాంధీ  ఐడియాలజీ సెంటర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేసారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్, టిడిపి లు మోసం  చేసాయని కేసీఆర్, బిఆర్ఎస్ నాయకులు అంటున్నారని... అయితే ఆ రెండు పార్టీల్లోనూ కేసీఆర్ వున్నారని రేవంత్ పేర్కొన్నారు. అంటే తెలంగాణకు ఆనాడు ఏ అన్యాయం జరిగినా అందుకు కేసీఆర్ కూడా బాధ్యుడే... నిజమైన తెలంగాణ ద్రోహి ఎవరైనా వున్నారంటే అది కేసీఆరే అని రేవంత్ అన్నారు. 

Read More  ఎన్నికలకు సిద్ధమవుతోన్న టీ.కాంగ్రెస్.. ‘‘తిరగబడదాం - తరిమికొడదాం’’నినాదంతో జనంలోకి

తెలంగాణ ఏర్పాటుకు ముందే కాదు రాష్ట్ర ఏర్పాటుతర్వాత అధికారంలోకి వచ్చికూడా కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేయడం ఆపడం లేదని రేవంత్ అన్నారు. తన పార్టీలోని తెలంగాణ పదాన్నే తొలగించిన కేసీఆర్ ఇంకా తెలంగాణవాది ఎలా అవుతారని రేవంత్ ప్రశ్నించారు. 

ఇక తెలంగాణ బిజెపిలో ప్రస్తుతం వున్న నాయకుల్లో సగంమంది ఇతర పార్టీలనుండి వచ్చినవారేనని రేవంత్ అన్నారు. అలాంటి నాయకులకు నమస్తే సదావత్సలే మాతృభూమే అంటే అర్థం ఏమిటో కూడా తెలియదన్నారు. బిజెపిలో ప్రస్తుతం పెద్ద నాయకులమని  చెప్పుకునే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దీని గురించి తెలుసా అంటూ రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపికి బలం లేదు...  ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ఎంపీ బండి సంజయ్ ను అడిగితే చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు. 

click me!