ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ బుధవారంనాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి తన భవనాన్ని కూల్చివేశారని నందకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జూబ్లీహిల్స్ జోనల్ కమిషనర్ చీఫ్ సిటీ ప్లానర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో నందకుమార్ కోరారు.
2022 నవంబర్ 13న నందకుమార్ నిర్వహిస్తున్న హోటల్ డెక్కన్ కిచెన్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్నాడు.
మొయినాబాద్ ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు వెలుగు చూసిన తర్వాత నందకుమార్ హోటల్ డెక్కన్ కిచెన్ ను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలున్నాయని జీహెచ్ఎంసీ అధికారులు ఈ భవనాన్ని కూల్చివేశారు. గతంలో నోటీసులు ఇచ్చినా కూడ నందకుమార్ పట్టించుకోని కారణంగా కూల్చివేసినట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే భవన నిర్మాణాన్ని కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశాలున్నాయని నందకుమార్ భార్య , కొడుకు భవనం కూల్చివేసే సమయంలో జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఈ భవనాన్ని కూల్చివేశారు.
also read:నందకుమార్ కు బెయిల్ మంజూరు: చంచల్ గూడ జైలు నుండి విడుదల
హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా తన హోటల్ భవనాన్ని కూల్చివేశారని నందకుమార్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని నందకుమార్ ఆ పిటిషన్ లో కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారిస్తుంది. మరో వైపు ఈ కేసులో పెద్ద ఎత్తున నగదు అంశం ప్రస్తావనకు రావడంతో ఈడీ అధికారులు కూడ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను ఈడీ అధికారులు విచారించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో పాటు మరో కేసులో బెయిల్ పై నందకుమార్ ఉన్నాడు. ఈ కేసుల్లో బెయిల్ పొందిన నందకుమార్ ఈ ఏడాది జనవరి 13న చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బీజేపీ నేతలకు ఈ కేసుతో సంబంధం ఉందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై సంతోష్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.