కూతురి పెళ్లి చేసి వస్తుండగా ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల మృతి, పాడెమోసిన ఎంపీ..

By AN TeluguFirst Published Sep 2, 2021, 10:44 AM IST
Highlights

కూతురు వివాహం కోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్ లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్లోని నివాసానికి వచ్చేందుకు 8:30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలుతో పాటు ఆమె భర్త మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్ పల్లి ఎంపీటీసీ గా పని చేస్తున్నారు.  ఆమె భర్త వేణుగోపాల్రెడ్డి (52) బిల్డర్.  హైదరాబాద్ లో  మన్సురాబాద్ లోని సహారా ఎస్టేట్ సమీపంలో వీరు ఉంటున్నారు.

కూతురు వివాహం కోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్ లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్లోని నివాసానికి వచ్చేందుకు 8:30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్ ను ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో కవిత ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ ను స్కార్పియో వాహనం వెనకనుంచి వేగంగా ఢీకొట్టడంతో టిప్పర్ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.  కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చిందని,  అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు.

కవితా, వేణుగోపాల్ రెడ్డి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.  కొడుకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా ఎంబిబిఎస్ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు.  పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మృతి చెందడం అందరినీ కలచివేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు స్వగ్రామం తిప్పర్తి మండలం  అనిశెట్టి దుప్పల పల్లి లో  జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని పాడే మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మృతులకు నివాళులు అర్పించారు. 

click me!