ఆంధ్రప్రదేశ్ అధికారులు నాగార్జుసాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
నాగార్జున సాగర్ : తెలంగాణలో పోలింగ్ రోజు తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యాం మీద నీటికోసం వివాదం చెలరేగడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యలో ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఈ నీటిని విడుదల చేశారు.
అయితే, పోలింగ్ రోజు ఇలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోవడం మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎక్కడికి పోదు, గేట్లు ఎక్కడికి పోవు.. ఇవ్వాలే గొడవ ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి చంద్రశేఖర రావు పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి.
undefined
నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు..
దీనిమీద తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రిష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన వైఖరి తీసుకొని.. ఎవరి వాటా ఎంతో తేల్చకపోతే ఈ గొడవలు సద్దుమణవన్నారు. మన వాటాలో ఒక్కచుక్క నీటిని కూడా అటువైపు పోనివ్వమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో కుమ్మక్కయ్యారని.. ఓడిపోతామని తెలిసి గొడవలకు తెరలేపుతున్నారన్నారు బండిసంజయ్.
సిపిఎం నేత నారాయణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేయడం కోసమే అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ లో గొడవ సృష్టించారన్నారు. కుట్రలు చేస్తున్నారన్నారు. వీరిద్దరి మధ్య తెలుగు ప్రజానీకం పావులైపోతున్నారని అన్నారు.