Telangana Elections 2023: పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి రావడం, ఓటు వేయడంపై ఎన్నికల సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు సదరు పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి.
Telangana Assembly Elections 2023: కట్టుదిట్టమైన భద్రత మధ్య తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా, జనగామాలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో అధికార పార్టీ నాయకుడు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావడం కనిపించింది. దీంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంగించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీలు నాయకలు డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకెల్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ.. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోని ప్రవేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఓటు వేయడానికి వచ్చిన ఆయన.. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఎమ్మెల్యే ఇలా రావడం పై ఎన్నికల సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు సదరు పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుండగా, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డారు.