కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషన్ నాగం బిఆర్ఎస్ చేరడం దాదాపు ఖాయమయిపోయింది.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నాయకులు ఓ పార్టీలోంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం ఇలా పార్టీ మారినవారి జాబితాలో వున్నారు. పార్టీమారినా తమకు టికెట్ దక్కదని తెలిసినా రాజకీయ భవిష్యత్ కోసం కొందరు నాయకులు పార్టీ మారుతున్నారు. ఇలా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.
టిడిపి నుండి బిజెపిలోకి... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు నాగం జనార్ధన్ రెడ్డి. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావించాడు. కానీ అతడికి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి ఇచ్చింది. సీనియర్ నాయకుడైన నాగంకు కాకుండా ఇటీవలే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన నాగం తన సన్నిహితులు, అనుచరులతో చర్చించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసాడు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాగంను బిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ఆ పార్టీ ఆసక్తి చూపుతోంది. స్వయంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు నాగం ఇంటికివెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ తో నాగం భేటీని కూడా మంత్రులు ఏర్పాటుచేసారు. ఇలా ప్రగతిభవన్ కు చేరుకున్న నాగం తన రాజకీయ భవిష్యత్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించారు. కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ దక్కడంతో నాగం జనార్ధన్ రెడ్డి బిఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read More అవమానం తట్టుకోలేకే కాంగ్రెస్‌కు రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరుతున్నా : నాగం జనార్థన్ రెడ్డి
ప్రగతి భవన్ లో నాగంకు అపూర్వ స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్ ఆయనతో ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కాస్సేపు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చ జరిగినట్లు... నాగంకు రాజకీయంగా మంచి అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.