హైదరాబాద్ : మూసీకి పోటెత్తిన వరద .. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

Siva Kodati |  
Published : Sep 05, 2023, 09:39 PM IST
హైదరాబాద్ : మూసీకి పోటెత్తిన వరద .. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

సారాంశం

హైదరాబాద్‌లో భారీ వర్షాల ధాటికి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకున్నాయి.  దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాల ధాటికి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకున్నాయి. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. మూసి వరద నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. 

కాగా.. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ వ‌ర‌ద కాలువలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో మోకాలి లోతు వ‌ర‌కు వ‌ర్ష‌పు నీరు చేరింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప నగరవాసులు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రోడ్లపైకి చేరిన వరద నీటిలో బైక్ లు, కార్లు ఇరుక్కుపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మూసాపేట మెట్రో స్టేషన్ కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కూకట్ పల్లి వైపు వెళ్లే వాహనాలు, అక్కడి నుంచి ఎర్రగడ్డ వైపు వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Also Read: Hyderabad rains: హైదరాబాద్‌లో ఆగ‌ని వ‌ర్షం.. ఏడు జిల్లాల‌కు రెడ్ అల‌ర్జ్

దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అరంఘ‌ర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. దీంతో జీహెచ్ ఎంసీ, డీఆర్ ఎఫ్ , ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. ఏదైనా స‌హాయం కోసం GHMC హెల్ప్‌లైన్ నంబర్ 040-21111111, డయల్ 100, 9000113667కు కాల్ చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఉత్తర వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. గంటకు 10-12 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉండటంతో మంగళవారం నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?