బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంపై ఆ పార్టీ అగ్రనేత మురళీధర్ రావు ఇవాళ స్పందించారు. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం వెనుక పార్టీ వ్యూహన్ని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: బండి సంజయ్ తెలంగాణ సీఎం పదవి రేసులో ఉన్నందునే ఆయనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించినట్టుగా ఆ పార్టీ చార్జీషీట్ కమిటీ చైర్మెన్ మురళీధర్ రావు చెప్పారు.
సోమవారంనాడు హైద్రాబాద్ లో మురళీధర్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం పదవి రేసులో లేరన్నారు. అందుకే ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్టుగా ఆయన తెలిపారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి తమ పార్టీలోకి వస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జూలై 4న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ గుడ్ బై చెప్పారు. ఆయన స్థానంలో అదే నెల 22న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సంస్థాగత మార్పుల్లో భాగంగానే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించారు.
తెలంగాణ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది కమలదళం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించిందని మురళీధర్ రావు ఇవాళ చెప్పారు.
దక్షిణాదిలో తెలంగాణలో అధికారాన్ని దక్కించకోవడం కోసం బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేయనుంది. ఇప్పటికే మూడు జాబితాలను బీజేపీ విడుదల చేసింది. మూడు జాబితాల్లో 88 అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది.
బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించిన తర్వాత పార్టీ బలహీనపడిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. కొందరు నేతలు పార్టీని వీడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు పార్టీని వీడారు. మరికొందరు నేతలు కూడ పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతుంది. బీజేపీకి చెందిన నేతలపై కాంగ్రెస్ వల విసురుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ లు కూడ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు అధికారాన్ని దక్కించుకోలేకపోయామనే భావనతో కాంగ్రెస్ ఉంది. కర్ణాటకలో అధికారాన్ని చేపట్టడంతో తెలంగాణపై కూడ కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.ఇదిలా ఉంటే రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యట్రిక్ కొట్టాలని ఆ పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది.