ప్యారాచుట్ నేతలకు టికెట్లు, ఉన్నత పదవులు.. బీజేపీ సీనియర్ నేతల్లో అసంతృప్తి

By Mahesh K  |  First Published Nov 6, 2023, 6:53 PM IST

ప్యారాచుట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారనీ, అనతి కాలంలోనే అగ్రతాంబూలం ఇస్తున్నారని బీజేపీ సీనియర్లు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. అభ్యర్థుల జాబితా ప్రకటనకు కొన్ని రోజుల ముందే పార్టీలోకి వచ్చిన వారికీ టికెట్లు దక్కాయి. పార్టీలో చేరిన స్వల్ప కాలానికే ఆ నేతలకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీల్లో చోటు కల్పించడంపైనా వారు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.
 


హైదరాబాద్: తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల్లో టికెట్ల కేటాయింపులపై తీవ్ర అసంతృప్తి ఉన్నది. ప్యారాచుట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అగ్ర ప్రాధాన్యతను ఇస్తూ.. వారికే టికెట్లు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అందులో బీజేపీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న నేతల సంఖ్య కేవలం 20 మాత్రమే ఉన్నది. కాగా, గత ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్యలో పార్టీలో చేరిన సుమారు 14 మంది నేతలకు టికెట్ దక్కిది. ఇక మిగిలిన వారంతా ఇటీవలే ప్రత్యర్థి పార్టీలో నుంచి బీజేపీలోకి చేరినవారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం.

ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాబపురావులు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, టీ రాజా సింగ్, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర స్థాయి నేలు ఎస్ కుమార్, పాయల్ శంకర్, రావు పద్మలను మినహాయిస్తే మిగిలిన వారంతా ఒకట్రెండు సంవత్సరాల్లో పార్టీలోకి చేరినవారే. 

Latest Videos

undefined

చిత్తరంజన్ దాస్, జీ కృష్ణ యాదవ్ వంటివారు అభ్యర్థుల జాబితా విడుదలకు కొన్ని రోజుల ముందే పార్టీ తీర్థం పుచ్చుకున్నవారే. మర్రి శశిధర్ రెడ్డి కూడా కొన్ని నెలల క్రితమే పార్టీలోకి వచ్చారు. ప్యారాచుట్ నేతల వల్ల టికెట్లు పొందలేకపోయిన సీనియర్ నేతలు చాలా వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలని లేదా.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి.

Also Read: మునుగోడులోనూ పోటీ చేయాలనుకుంటున్నాం: తమ్మినేని.. మరో ఇద్దరు అభ్యర్థుల ప్రకటన

టికెట్ల విషయంలోనే కాదు.. కొత్తగా చేరిన కొందరు నేతలను స్వల్పకాలంలోనే పార్టీ ఉన్నత పదవుల్లో కూర్చోబెడుతున్నారు. రాష్ట్ర కమిటీలో, జాతీయ కార్యవర్గ కమిటీలోకి తీసుకున్నారు. మరో వైపు పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న నేతలను కనీసం రాష్ట్ర కమిటీలోకి కూడా తీసుకోలేదు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

click me!