మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ కొట్టింది. మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపును రుచి చూసింది.
దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ (TRS) నుంచి బీఆర్ఎస్ (BRS)గా మారిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ కు మరాఠా గడ్డపై తొలి విజయం లభించింది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొంది.. గులాబీ జెండాను ఎగరేశారు. ఈ గెలుపుతో.. మహారాష్ట్రలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
వాస్తవానికి బీఆర్ఎస్ గత రెండు నెలలుగా పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక ద్రుష్టి సారించారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసింది. తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో భండారా జిల్లాలో ఏకంగా 9 గ్రామ పంచాయతీలలో గులాబీ పార్టీ గెలుపొంది.. బోణీ కొట్టింది.
భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలలో 20 గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడగా.. అందులో 9 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటుకుంది. ఇప్పటి వరకు ఆ జిల్లాలో వెలువడిన ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు గ్రామ పంచాయతీలను మాత్రమే గెలుచుకున్నాయి. అలాగే శరద్ పవర్ పార్టీ ఎన్సీపీ ఒక గ్రామ పంచాయతీలో విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి ఎంటరైన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రంలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తోంది. అంతే కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
ఈ క్రమంలో పార్టీ కేడర్‌ను పెంచుకోవటం, కార్యకర్తలకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.పక్కా ప్రణాళిక ప్రకారం మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటుందని, తెలంగాణ గడ్డ మీది లాగా మరాఠా గడ్డపై గులాబీ జెండా సత్తా చాటుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అదేసమయంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమాలను చూసి అక్కడి ప్రజలు ఆకర్షితులవుతున్నారట. ప్రధానంగా దళిత బంధు, రైతు బంధు, ఉచిత విద్యుత్, సాగు నీరు వంటి పథకాలను.. తాము మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అందిస్తామని సిఎం కెసిఆర్ చెబుతుండటంతో మహారాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.