Munugode Bypoll 2022: ఆగస్టు 25న బహిరంగ సభతో ప్రచారాన్ని మొదలుపెట్టనున్న టీఆర్ఎస్.. కేసీఆర్ హాజరవుతారా?

By Sumanth KanukulaFirst Published Aug 11, 2022, 12:26 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్‌ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా వ్యుహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ ద్వారా ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించాలని టీఆర్ఎస్ చూస్తోంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికార టీఆర్ఎస్‌ కూడా మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకునేలా వ్యుహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ ద్వారా ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఇప్పటికే గత వారం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించగా.. బీజేపీ ఆగస్టు 21న సభ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఆగస్టు 25న మునుగోడులో టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేయాలని చూస్తోంది. అయితే ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని టీఆర్ఎస్ వర్గాలు తెలపాయి. అయితే జిల్లాల పర్యటన చేపట్టనున్న కేసీఆర్.. అక్కడ సభల వేదికగా మునుగోడు అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అయితే మునుగోడులో నిర్వహించే సభకు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి  నల్గొండ జిల్లా సీనియర్ నేత జగదీష్ రెడ్డి సారథ్యం వహించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే మునుగోడులో లో ప్రొఫైల్‌ను అవలంభిస్తోంది. అయితే అంతర్గతంగా ప్రణాళికలను సిద్దం చేస్తుందని.. ఎన్నికలు సమీపించే సమయంలో వాటిని అమలు చేస్తోందని పార్టీ  వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన క్యాడర్‌పై టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సైలెంట్‌గా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి.  

Also Read: Munugode Bypoll 2022: మునుగోడులో పక్కాగా కెసిఆర్ దళిత బంధు వ్యూహం

ప్రతిపక్ష పార్టీలకు సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చేలా ప్రతి గ్రామం, మండలానికి టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం ఇంచార్జ్‌లను నియమించిందని తెలుస్తోంది. మునుగోడులో మెజారిటీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే బీజేపీ బహిరంగ సభ నిర్వహించే వరకు వేచి ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున నాయకులను, జనాలను సమీకరించి బహిరంగ సభ ద్వారా భారీ ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది.  ఆగస్టు 25 బహిరంగ సభ తర్వాత టీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ ఆగస్టు 14 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టున్నారు. తొలుత వికారాబాద్‌లో పర్యటించి సమీకృత కలెక్టరేట్‌ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో సీఎం పర్యటించి సమీకృత కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారని.. ఇది మునుగోడు ప్రచారానికి పరోక్షంగా దోహదపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

click me!